హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో జంట పేలుళ్ళ కేసులో దోషులకు ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్షను తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. ఆ కేసులో ఐదుగురిని దోషులుగా నిర్ధారించిన ఎన్ఐఏ కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. దాన్ని సవాల్ చేస్తూ దోషులు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఆ అప్పీళ్ళను హైకోర్టు ఇవాళ కొట్టిపడేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్ధించింది.
2013 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో రెండు పేలుళ్ళు చోటు చేసుకున్నాయి. ఆ జంట పేలుళ్ళ కారణంగా 18మంది ప్రాణాలు కోల్పోయారు. 131మంది గాయపడ్డారు. ఆ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. మరో ఐదుగురు నిందితులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా నిర్ణయించింది. యాసీన్ భత్కల్, అసదుల్లా అక్తర్, జియావుర్ రెహమాన్, మహమ్మద్ తహసీన్ అక్తర్, అజాజ్ షేక్
అనే ఐదుగురికీ ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఉరిశిక్షను ధ్రువీకరించడానికి ఎన్ఐఏ కోర్టు విషయాన్ని తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. అదే సమయంలో దోషులు ఐదుగురూ కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పి శ్రీసుధలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వారి అప్పీళ్ళపై విచారణ జరిపింది. చివరకు నేడు ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్ధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత