గోదావరి జలాల వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు బోర్డుకు అప్పగించే విషయంపై హైదరాబాద్ జలసౌధలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
జలసౌధలో గోదావరి బోర్డు ఛైర్మన్ ఎ.కె.ప్రధాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం. వెంకటేశ్వరరావు, అంతరాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ సుగుణాకరరావు, తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి బుజ్జా రాహుల్, ఈఎన్సీ అనిల్ కుమార్, బోర్డు సెక్రటరీ అలగేసన్, బోర్డు సభ్యలు, జెన్ కో అధికారులు హాజరైన సమావేశం వాడివేడిగా సాగింది.
పోలవరం బనకచర్ల ప్రాజెక్టును గోదావరిలోని వరద జలాలను తరలించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు, నికర జలాలను ముట్టుకోమని ఏపీ చీఫ్ ఇంజనీర్ ఎం.వెంకటేశ్వరరావు ప్రస్తావించారు. నికర జలాలతో ఈ ప్రాజెక్టుకు సంబంధం లేదు. అవార్డు మేరకు సముద్రంలో కలిసే వరద జలాలనే వాడుకుంటామని, ఎందుకింద ఆందోళన చెందుతున్నారని తెలంగాణ అధికారులను ప్రశ్నించారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు నిధుల సేకరణకు ప్రత్యేకంగా అమరావతి జలహారతి కార్పొరేషన్ కూడా ప్రారంభించారని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనకు ఇప్పటికే కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారని ఆయన వాదించారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలంగాణ ఇంజనీర్లు వాదనలు వినిపించారు. పర్యావరణ అనుమతులు కూడా లేకుండా ప్రాజెక్టు ఎలా చేపడతారని వారు ప్రశ్నించారు.
పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు కనీసం డీపీఆర్ సిద్దం కాలేదు. ఇది కాన్సెప్ట్ మాత్రమే. డిజైన్లు లేకుండా ప్రాజెక్టు పనులు ఎలా చేపడతారంటూ ఏపీ ఈఎన్సీ తెలంగాణ అధికారులను ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తీసుకున్నారని పోలవరం కాలువల సామర్థ్యం 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారని తెలంగాణ ఇంజనీర్లు వాదించారు. ఇప్పటికే గుత్తేదారులకు కొంత బిల్లులు కూడా చెల్లించారని వారు సమావేశంలో పేర్కొన్నారు.
కేవలం ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపినంత మాత్రాన డిజైన్లు, డీపీఆర్ లేకుండా పనులు చేయడం సాధ్యమవుతుందా అని ఏపీ ఈఎన్సీ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లు, డిజైన్లు లేకుండా, ఏపీకి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అనేక ప్రాజెక్టులు పూర్తి చేసిందని ఏపీ ఈఎన్సీ ఆరోపించారు. తెలంగాణకు ఉపయోగపడని వరద జలాలతో ప్రాజెక్టు చేపడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రశ్నించారు.
పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ గోదావరి బోర్డును సమాచారం కోరింది. ఆ లేఖ వివరాలు తమకు ఎందుకు ఇవ్వలేదని తెలంగాణ తెలంగాణ అధికారులు బోర్డు సభ్యుడు కనోడియాను నిలదీశారు. ఆ సమాచారం ఇవ్వాల్సిన పనిలేదు. అది బోర్డుకు, కేంద్ర జలశక్తి శాఖ మధ్య జరిగిన అంతర్గత వ్యవహారమని కనోడియా బదులిచ్చారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమవద్ద లేదన్నారు. ఇదే విషయం కేంద్ర జలశక్తి శాఖకు తెలియజేసినట్లు కనోడియా చెప్పారు.
కీలక సమాచారం తమకు ఎందుకు తెలియజేయలేదని తెలంగాణ అధికారులు బోర్డు సభ్యులను ప్రశ్నించారు. బోర్డులో జరిగే ప్రతి అంశాన్ని తెలంగాణ అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని సభ్యులు గట్టిగా బదులిచ్చారు. కేంద్ర జలశక్తి అధికారులకు లేఖ రాసి, వారు చెప్పినట్లు చేస్తామని బోర్డు సభ్యులు ప్రకటించారు. బోర్డు స్వతంత్రతకు ఇది భంగకరమని తెలంగాణ అధికారులు వాదించారు. గోదావరి వరద జలాల ఆధారంగా ఏపీ నిర్మించే పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏ విధంగా నష్టమో చెప్పకుండా కాగితాలు ఇవ్వలేదంటూ వాదనలు ఏంటని బోర్డు ఛైర్మన్ ప్రధాన్ ప్రశ్నించారు.
పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రాజెక్టుల అప్పగింతపై కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌పై ఏపీ ప్రభుత్వం కొన్ని మార్పులు కోరింది. సవరణలు చేసిన తరవాత ప్రాజెక్టులు అప్పగించే దానిపై చర్యలు తీసుకుంటామని ఏపీ అధికారులు తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టులు ఏవీ లేవు. మా రాష్ట్రంలో ఉన్నవి మేం నిర్వహించుకుంటామన్నారు. అదే సమయంలో తెలంగాణలో ఉన్నవి ఉమ్మడి ప్రాజెక్టులు. వాటి నిర్వహణ తీరు వల్ల ఏపీ నష్టపోతోంది. వాటిని బోర్డుకు అప్పగించాలని ఈఎన్సీ వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు.
ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగంపై సమాచారం సమర్పించేందుకు తాము సిద్దమేనని ఏపీ ఈఎన్సీ స్పష్టం చేశారు. పెద్దవాగు ప్రాజెక్టు వరదలకు దెబ్బతినిందని, రూ. 15 కోట్లతో మరమ్మతులు చేపట్టాలని కోరారు. కొందరు అధికారులు ఏపీకి వస్తే ఎంత నష్టం జరిగిందో తేలుద్దామని ఏపీ అధికారులు తెలిపారు. పెద్దవాగు ప్రాజెక్టు, కాలువల ఆధునికీకరణపై దృష్టి సారించాలని బోర్డును కోరారు. పెద్దవాగు ప్రాజెక్టు కింద ఏపీలో ఆయకట్టు ఎక్కువ ఉందని గుర్తుచేశారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత