పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం అధికారులు, క్యాంపస్ ఆవరణలో శ్రీరామ నవమి వేడుకలు జరుపుకోకూడదు అంటూ ఉత్తర్వులు జారీ చేసారు. 68ఏళ్ళ విశ్వవిద్యాలయ చరిత్రలో అలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఇదే మొదటిసారి. ఆ చర్య ఆ విద్యాసంస్థలో మతస్వేచ్ఛ లేమి, పారదర్శక నిర్వహణ లేమి, ఏకపక్ష లౌకికవాదం, అతివాద భావజాలాలకు ప్రతీకగా నిలిచింది. తటస్థ విద్యార్ధుల్లో సైతం జాతీయతా భావాన్ని రగిలించింది.
విశ్వవిద్యాలయ అధికారులు చాలా స్పష్టంగా క్యాంపస్ ఆవరణలో రామనవమి జరపడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు జారీ చేసారు. పదేపదే ప్రకటనలు చేసారు. ‘యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ అందుబాటులో లేరు’ అనే సాకుతో విద్యార్ధులపై ఆంక్షలు విధించారు. అయితే హిందూ విద్యార్ధులు తమ విశ్వాసాలను వదులుకోలేదు. ఏప్రిల్ 6 శ్రీరామ నవమి రోజున విశ్వవిద్యాలయంలోని టెక్నాలజీ భవన్ ముందు శ్రీరాముడి విగ్రహం ప్రతిష్ఠాపించారు. ఆ ఆవరణలో కాషాయ జెండాలతో పాటు మువ్వన్నెల జెండాను సైతం ఏర్పాటు చేసారు. శ్రీరాముడి స్తోత్రాలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసారు. వేర్పాటువాద రాతలున్న గోడలపై అరవింద యోగి వంటి జాతీయవాద నాయకుల చిత్రాలు, జాతీయవాద చిహ్నాలను అమర్చారు.
జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయ విద్యార్ధుల చర్య కేవలం తమ విశ్వాస ప్రకటన మాత్రమే కాదు, వర్సిటీలో ముదిరిపోయిన సైద్ధాంతిక అణచివేత, ద్వంద్వ వైఖరికి వ్యతిరేకమైన తమ భావాల విస్పష్ట ప్రదర్శన. జేయూలో సాధారణంగా వామపక్ష విద్యార్ధి సంఘాలదే పైచేయి. వారి అతికి హద్దూపద్దూ ఉండేది కాదు. ఆజాద్ కశ్మీర్, పాలస్తీనాకు విముక్తి, ఆజాద్ మణిపూర్ వంటి నినాదాలు విశ్వవిద్యాలయం అంతటా ప్రతీ గోడ మీదా కనిపిస్తున్నా వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోరు.
ఈ కథ 2025 మార్చి 28న మొదలైంది. కొందరు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ సభ్యులతో పాటు పలువురు తటస్థ విద్యార్ధులు విశ్వవిద్యాలయ నిర్వాహకులకు ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. రాబోయే శ్రీరామ నవమి రోజు క్యాంపస్‌లో వేడుకలు చేసుకుంటామని ఆ దరఖాస్తు ద్వారా వారు కోరారు. అయితే వైస్ ఛాన్సలర్ లేనందున రామనవమి వేడుకలకు అనుమతి మంజూరు చేయలేమంటూ నిర్వాహకులు తప్పుకున్నారు.
అయితే, విద్యార్ధులు వెంటనే వర్సిటీ అధికారుల రెండు నాల్కల ధోరణిని బైటపెట్టారు. ‘‘ఏప్రిల్ 3, 4 తేదీల్లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) క్యాంపస్ ఆవరణ లోపలే ఒక రాజకీయ కార్యక్రమం నిర్వహించింది. దానికి వారికి అనుమతి ఇచ్చారు. అప్పుడు కూడా వైస్‌ఛాన్సలర్ లేరు. కాబట్టి, శ్రీరామ నవమి వేడుకలకు అనుమతి ఇవ్వకపోవడం మాపై చూపుతున్న వివక్షే’’ అని సోమసూర్య బెనర్జీ అనే విద్యార్ధి బైటపెట్టాడు.
ఈ తేడాని మరింత బలంగా అందరికీ తెలిసేలా చేయడానికి విద్యార్ధులు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ అయిన రాష్ట్ర గవర్నర్‌కు, సిటీ పోలీసులకూ సమాచారం అందించారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారం తమ మత స్వేచ్ఛను వినియోగించుకోవడం తమ ప్రజాస్వామిక హక్కు అని స్పష్టం చేసారు.
ఇఫ్తార్ విందుకు అనుమతి, రామనవమికి ఎందుకు లేదు?
ఈ వివాదాగ్నిలో ఆజ్యం పోసినట్లు మరో పరిణామం చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం రంజాన్ సందర్భంగా విశ్వవిద్యాలయంలో ఇఫ్తార్ విందులు ఇచ్చేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఇఫ్తార్ విందు ఇచ్చుకోడాన్ని చాలామంది విద్యార్ధులు గౌరవంగా అంగీకరించారు. కానీ అదే స్వేచ్ఛ హిందూ విద్యార్ధులకు ఎందుకు లేదని నిలదీసి ప్రశ్నించారు.
‘‘మేం ఇఫ్తార్‌కు వ్యతిరేకం కాదు. మేము ఇఫ్తార్ విందుకు హాజరయ్యాము, దానిపై మా గౌరవాన్ని ప్రకటించాము. కానీ మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటామంటే భయం ఎందుకు?’’ అని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ అధ్యక్షుడు నిఖిల్ దాస్ ప్రశ్నించారు.
వారికి మద్దతుగా బయటినుంచి కూడా చాలామంది ప్రముఖులు మాట్లాడారు. ‘‘ఇక్కడ సరస్వతీ పూజ చేసుకుంటాం, ఇఫ్తార్ విందులు ఇస్తాం. అలాంటప్పుడు రామనవమికి అనుమతి నిరాకరించడం ద్వంద్వ బుద్ధి మాత్రమే. మనం నిజంగా ఏకత్వాన్నీ, లౌకికవాదాన్నీ నమ్ముతుంటే అన్ని విశ్వాసాలనూ సమానంగా చూడాల్సిందే’’ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, వైస్‌ఛాన్సలర్ నామినీ కాజీ మాసూమ్ అక్తార్ అభిప్రాయపడ్డారు.
యూనివర్సిటీ గోడల మీద దేశవ్యతిరేక రాతల విషయంలో నిర్వాహకులు ఏ చర్యా తీసుకోకపోడాన్ని కూడా అక్తార్ ఖండించారు. ‘ఆజాద్ కశ్మీర్’ నినాదాలు ఎందుకున్నాయి, రామనవమి వేడుకలను ఎందుకు వద్దన్నారు అన్న విషయాలు తెలియాల్సిందే అని ఆయన డిమాండ్ చేసారు.
రామ నవమి వేడుకలు జరుపుకోడానికి స్థలం ఎంపిక కూడా ప్రతీకాత్మకమైనదే. గేట్ నెంబర్ 3 దగ్గరున్న టెక్నాలజీ భవన్ ఎదురుగా ఉన్న గోడమీద వేర్పాటువాద ఉద్యమాలు, అతివాద భావజాలాలకు సంబంధించిన రాతలు ఉంటాయి. ఆధ్యాత్మికతను పూర్తిగా వ్యతిరేకించే భావజాలాలకు అది కేంద్రస్థానం.
ఆ గోడ మీద ఆజాద్ కశ్మీర్, పాలస్తీనాను విముక్తం చేయాలి, ఆజాద్ మణిపూర్ వంటి నినాదాలు ఉండేవి. వాటి మీద విద్యార్ధులు శ్రీరాముడు, అరవింద యోగి, త్రివర్ణ పతాకాలను చిత్రించారు. ‘‘ఇది అరవింద యోగి (ఘోష్) విశ్వవిద్యాలయం, ఇప్పుడు జాదవ్‌పూర్ యూనివర్సిటీగా మారిన నేషనల్ కాలేజీకి అరవింద ఘోష్ మొట్టమొదటి ప్రిన్సిపాల్. ఆయన ఆధ్యాత్మికంగా జాగృతమైన సార్వభౌమ భారతదేశాన్ని స్వప్నించాడు. ఆ దార్శనికతను మేము ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి తెస్తున్నాం’’ అని ఒక విద్యార్ధి చెప్పుకొచ్చాడు.
శ్రీరామ నవమి వేడుక చుట్టూ వివాదం రాజేయడంపై రాజకీయ నాయకులు సైతం తీవ్రంగా స్పందించారు. బీజేపీ మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ జేయూ విద్యార్ధుల ధర్మదీక్షను ప్రశంసించారు. ‘‘అసహనతనే సిద్ధాంతంగా మార్చుకున్న వారి కేంద్రంలో శ్రీరామ నవమి వేడుక జరుపుకునే ధైర్యం చేసినందుకు ఈ విద్యార్ధులకు నేను సెల్యూట్ చేస్తున్నాను’’ అన్నారు.
కోల్‌కతాలో శ్రీరామ నవమి శోభాయాత్రలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీ, పశ్చిమబెంగాల్ పోలీసులు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘హిందువుల పండుగలు జరుపుకోవాలంటే కోర్టు ఉత్తర్వులు కావలసిన దుస్థితి ఉన్న ఒకే ఒక రాష్ట్రం బెంగాల్. కానీ వామపక్ష గ్రూపుల రాజకీయ కార్యక్రమాలకు, మైనారిటీల మత కార్యక్రమాలకూ అనుమతులు అడక్కపోయినా వచ్చేస్తుంటాయి. ఇది లౌకికవాదం కాదు, లొంగుబాటు’’ అని ఘాటుగా స్పందించారు.
జాదవ్‌పూర్ యూనివర్సిటీ మాజీ వీసీ బుద్ధదేబ్ సాహూ చాలా విలువైన ప్రశ్న అడిగారు. ‘‘ఇప్పుడు వీసీ లేకపోతే, రామనవమి వేడుకకు అనుమతి ఎవరు నిరాకరించారు? విశ్వవిద్యాలయం శూన్యంలో పనిచేయలేదు కదా. నేను ఉన్నప్పుడు దుర్గాపూజలో పాల్గొన్నాను, సరస్వతీ పూజలో పాల్గొన్నాను, ఇఫ్తార్ విందులో పాల్గొన్నాను. అవన్నీ ప్రశాంతంగానే జరిగాయి. ఇప్పుడు వీసీ లేరు కాబట్టి రామనవమికి అనుమతి లేదు అని చెప్పడం నిజాయితీ కాదు, దానివెనుక కచ్చితంగా రాజకీయ ప్రేరేపణలున్నాయి’’ అని తేల్చిచెప్పారు.
హిందువుల పండుగల గురించి చాలా అతివాద ధోరణిలో చిత్రీకరించడం బెంగాల్‌లో సర్వసాధారణం. కానీ వాటికి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు చాలా ప్రశాంతంగా జరిగాయి. విశ్వవిద్యాలయం నిధులు ఉపయోగించలేదు. ఎలాంటి హింసాకాండ జరుగలేదు. ఎలాంటి రాజకీయ నినాదాలూ చేయలేదు. వాటికి బదులు దైవనామ స్మరణ జరిగింది, ప్రసాద వితరణ జరిగింది. జై శ్రీరామ్ భజన జరిగింది. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం ఆవరణలోపల జరిగిన ఈ హిందూ వేడుకలో విద్యార్ధులు స్వచ్ఛందంగా, పెద్దసంఖ్యలో పాల్గొనడం ఇదే మొదటిసారి.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి