మాంద్యం భయాలు స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ప్రారంభానికి ముందే స్టాక్ సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన నూతన పరస్పర సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో స్టాక్ సూచీలు భారీగా పతనం అయ్యాయి. మెటల్ రంగాలు కుదేలయ్యాయి. ఒక్క రోజులోనే మదుపరులు 13 లక్షల కోట్లు కోల్పోయారు.
సెన్సెక్స్ 2226 పాయింట్లు కోల్పోయి 73137 వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 3900 పాయింట్లు పైగా కోల్పోయింది. నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవిచూసింది. 742 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 22161 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభంలో మదుపరులు పది సెకన్ల వ్యవధిలోనే 20 లక్షల కోట్లు నష్టపోయారు.
బీఎస్ఈ మిడ్ క్యాప్ షేర్లు 10 శాతం పతనమయ్యాయి. బ్యాంకింగ్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. బ్యాంకు నిఫ్టీ 1642 పాయింట్లు నష్టపోయింది. రూపాయి స్వల్పంగా బలపడింది. తాజాగా డాలరుతో రూపాయి విలువ 85.84గా కొనసాగుతోంది.
పలు దేశాల మార్కెట్లతో పోల్చుకుంటే భారత స్టాక్ మార్కెట్లు తక్కువగా నష్టాలను చవిచూశాయి. జపాన్, తైవాన్, సింగపూర్, హాంకాంగ్, ఈయూ, ఇటలీ మార్కెట్లు 8 నుంచి 10 శాతం నష్టాలను చవిచూశాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీలో రిలయన్స్ షేరు విలువ 3.5 శాతం తగ్గింది. ఇంట్రాడేలో 7.4 శాతం తగ్గి 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. ముకేశ్ అంబానీ నికర సంపద విలువ ఒకే రోజు 3.6 బిలియన్ డాలర్లు తగ్గింది. రిలయన్స్ సంస్థలు 30 వేల కోట్ల నష్టాలను చవిచూశాయి.
అదానీ గ్రూపు కంపెనీలు 5 శాతం నష్టపోయాయి. అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ నికర సంపదలో 3 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. అదానీ మొత్తం ఆస్తుల విలువ 57.3 బిలియన్ డాలర్లకు తగ్గిందని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది.
ఓపీ జిందాల్ గ్రూప్ ఇవాళ ఒక్క రోజే 2.2 బిలియన్ డాలర్లను నష్టపోయింది. రూ.18 వేల కోట్ల నష్టాలను చవిచూసింది. తాజాగా కంపెనీ నికర సంపద 33.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ షేర్లు 7 శాతం పతనమయ్యాయి.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో హిందుస్థాన్ యూనిలీవర్ మినహా అన్నీ నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్ 7.73 శాతం, ఎల్ అండ్ టీ 5.78, టాటా మోటార్స్ 5.54, కోటక్ మహీంద్రా బ్యాంక్ 4.33, ఇన్ఫోసిస్ 3.75 శాతం నష్టపోయాయి. ట్రంప్ పరస్పర సుంకాల ప్రభావంతో ముడిచమురు ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్ ధర 63 డాలర్లకు తగ్గింది. బంగారం ఔన్సు 3045 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి