అక్రమ వలసదారులపై సౌదీ అరేబియా కొరడా ఝుళిపించింది. వారంలోనే 18407 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసింది. వీరంతా కూలీలని సరిహద్దు భద్రతా దళాలు తెలిపాయి. మార్చి 27 నుంచి ఏప్రిల్ 2 వరకు ప్రభుత్వ ఏజన్సీలు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో వేలాది మందిని అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా దేశంలోకి చొరబడిన వారిని, సరిహద్దులు దాటుకుని వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 12995 మంది సౌదీ అరేబియా నివాస చట్టాలను, 3512 మంది సరిహద్దు భద్రతా చట్టాలను, 1900 మంది లేబర్ చట్టాలను ఉల్లంఘించారని ఇంటీరియర్ మినిస్ట్రీ ప్రకటించింది.
ఇప్పటి వరకు అరెస్టైన వారిలో అత్యధికంగా 66 శాతం మంది ఇథోపియా నుంచి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. 26 శాతం మంది యెమన్ వాసులుగా తేల్చారు. మొత్తం 27288 మంది నిబంధనలు ఉల్లంఘించినట్లు దౌత్యకార్యాలయాలకు సమాచారం పంపించారు. వీరిలో 7523 మందిని వెనక్కు తిప్పి పంపించారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించేవారిపైనా కేసును నమోదు చేస్తున్నారు.
అక్రమ వలసదారులకు సాయం చేసిన వారికి 15 సంవత్సరాల శిక్ష ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. అలాంటి వారిని 21 మందిని అరెస్ట్ చేసింది. వీరికి భారీగా జరిమానాలు కూడా విధిస్తారు. వారి ఆస్తులు, వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
సౌదీ అరేబియా తాజాగా 14 దేశాల పౌరుల వీసాలపై నిషేధం విధించింది. తాజా జాబితాలో భారత్, పాక్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ వీసాలు జూన్ వరకు ప్రభావితం కానున్నాయి. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేసే వారిని కూడా అడ్డుకునేందుకు సౌదీ చర్యలు చేపట్టింది. హజ్ యాత్ర పేరుతో ఉమ్రా, విజిట్ వీసాలతో ప్రవేశించి గడువు తీరినా వెళ్లకుండా ఉండిపోతున్నారని సౌదీ తెలిపింది.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి