మునంబం వక్ఫ్ వ్యతిరేక ఆందోళనకారుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఏప్రిల్ 2, 3 తేదీల్లో వరుసగా లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఆ రెండు రోజులూ మునంబం గ్రామ ప్రజలు కళ్ళు టీవీలకు అతికించేసారు. ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా అని ఆత్రంగా ఎదురు చూసారు. ఎందుకంటే, అది వాళ్ళకు జీవన్మరణ సమస్య మరి. ఒక్కసారి బిల్లుకు సభలో ఆమోదం లభించిందని తెలియగానే సంతోషంతో కేరింతలు కొట్టారు. రహదారుల మీదకు వచ్చి ఊరేగింపులు నిర్వహించారు.
మునంబం వక్ఫ్ బాధిత ఆందోళనకారులు కేరళ ఎంపీల జాబితా ప్రకటించారు. వారిలో వక్ఫ్ బిల్లుకు ఎవరెవరు ఎలా ఓటు వేసారో ప్రదర్శించారు. కేరళ ఎంపీల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినది కేంద్రమంత్రి సురేష్ గోపి ఒక్కరే. మిగతా అందరూ ఆ బిల్లును వ్యతిరేకించిన వారే.
బీజేపీ కేరళ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా ఈమధ్యనే ఎన్నికైన రాజీవ్ చంద్రశేఖర్ ఏప్రిల్ 4న మునంబం వక్ఫ్ బాధితుల ఆందోళన శిబిరాన్ని సందర్శించారు. వారి ఆందోళన ప్రారంభించి అది 174వ రోజు. వక్ఫ్ సవరణ బిల్లు పాస్ అయిన తర్వాతే మునంబం వాసులకు ముఖం చూపిస్తానంటూ రాజీవ్ చంద్రశేఖర్ వారికి వాగ్దానం చేసారు. అందుకే ఆయన తన మాట నిలబెట్టుకుంటూ ఏప్రిల్ 4న అక్కడకు వెళ్ళారు. రాజీవ్ చంద్రశేఖర్, ఆయన బృందానికి మునంబం వాసులు హృదయపూర్వక స్వాగతం పలికారు. వారందరూ కలిసి మునంబం గ్రామకేంద్రం నుంచి ఆందోళనకారుల శిబిరం ఉన్న వేలాంకని మాత చర్చ్ వరకూ ఊరేగింపుగా వెళ్ళారు. అక్కడ చర్చ్‌లోని మత గురువు (వికార్), ల్యాండ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నాయకులూ వీరిని ఆహ్వానించారు.
చర్చ్ ఆవరణలో ఉన్న ప్రతీ వ్యక్తీ బీజేపీ రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి నాయకులకు కృతజ్ఞతలు ప్రకటించారు. వేలాంకని మాత చర్చిలో వికార్గానూ, ల్యాండ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ధర్మకర్తగానూ పనిచేస్తున్న ఫాదర్ ఆంటోనీ జేవియర్ థరాయి బీజేపీని ప్రశంసల్లో ముంచెత్తారు. 174 రోజులుగా తాము చేస్తున్న ఆందోళనకు బీజేపీయే అండగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల జాబితా నుంచి మునంబం భూములను తొలగించి, తమ రెవెన్యూ హక్కులను పునరుద్ధరించేంత వరకూ తమ నిరాహార దీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు.
ఆందోళనకారులు ఒక్కరొక్కరుగా అందరూ తమకు బీజేపీ నాయకులు అందించిన సహాయం గురించి వివరించారు. కేంద్ర మంత్రులు సురేష్ గోపి, జార్జి కురియన్లకు ధన్యవాదాలు తెలిపారు. వక్ఫ్ బిలు పాస్ అయిన సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ మునంబం ఆందోళనకారులకు మిఠాయిలు పంచారు.
ఆ సందర్భంగా, రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో మునంబం ఆందోళనకారుల్లో 50 మంది బీజేపీలో చేరారు. వారు ప్రధానంగా వక్ఫ్ వ్యతిరేక ఆందోళనకారులు. గతంలో వారు సీపీఎం, కాంగ్రెస్‌లలో పనిచేసారు. వక్ఫ్ బోర్డు తమ భూములను ఆక్రమించుకున్నప్పుడు తమకు ఎలాంటి సాయమూ చేయని ఆ పార్టీల వైఖరితో వారు విసిగిపోయారు. రాజీవ్ చంద్రశేఖర్ వారికి శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మరోవైపు, ఇడుక్కి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి బెన్నీ పెరువంతనం తన పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికీ రాజీనామా చేసారు. వక్ఫ్ బిల్లు విషయంలో కాంగ్రెస్ వైఖరిపై తన నిరసనను వ్యక్తం చేయడానికి ఆయన రాజీనామా మార్గం ఎంచుకున్నారు. కాంగ్రెస్ క్రైస్తవ మైనారిటీల వ్యతిరేకి అనీ, కేవలం ఒక వర్గం ప్రజలను మాత్రమే బుజ్జగించడమే విధానంగా పెట్టుకుందనీ ఆ పార్టీ మీద మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లిములు ఒక్కరే మైనారిటీలుగా కనిపిస్తారని ఆవేదన చెందారు. పార్టీకి చెందిన ఎన్నో వేదికల మీద తను ఈ విషయం గురించి ప్రస్తావించినప్పటికీ, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగానే మిగిలిపోయిందని బాధపడ్డారు. కేరళ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్‌ను కానీ, కేరళ చర్చ్‌ను కానీ కాంగ్రెస్ కనీసం గౌరవించలేదని వాపోయారు. మునంబం వ్యవహారంలో కాంగ్రెస్ వైఖరి పూర్తిగా తప్పు అన్నారు. అందుకే ఆ పార్టీలో తాను ఇకపై కొనసాగలేనని స్పష్టం చేసారు.
ఈ పరిణామాలు కేరళలో వస్తున్న గణనీయమైన మార్పులకు సంకేతాలుగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్, సిపిఎంకు చెందిన లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ రెండు కూటములూ ఓటుబ్యాంకు రాజకీయాలు ఏవిధంగా చేస్తున్నాయన్నది కేరళ క్రైస్తవులు స్పష్టంగా తెలుసుకున్నారు. అంతేకాదు జాతీయవాద రాజకీయ పార్టీ అయిన బీజేపీ, దాని నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ ఎలయెన్స్ ఆచరణ ఎంత తార్కికంగా, సహేతుకంగా ఉంటుందో అర్ధం చేసుకున్నారు. దాని ప్రభావం అతి త్వరలోనే కనిపించే అవకాశాలున్నాయి. 2025 సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, అలాగే 2026 ఏప్రిల్‌లో కేరళ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల ప్రభ పూర్తిగా మసకబారడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళలో బీజేపీ ఇప్పటివరకూ అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల్లో పెద్దగా విజయాలు సాధించినది ఏమీ లేదు. కానీ క్రమక్రమంగా ఓటుబ్యాంకును నిర్మించుకుంటూ వస్తోంది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో సురేష్ గోపి విజయం సాధించడం ద్వారా కేరళ బీజేపీ ఖాతా తెరిచింది. మునంబం వ్యవహారంలో నిజాయితీగా క్రైస్తవులకు సహకరించడం కమలనాథులకు కలిసొచ్చిన అంశం. అటువైపు, కాంగ్రెస్, వామపక్షాలూ ముస్లిముల కోసం తమను బలిపెట్టడం వారికి మింగుడు పడడం లేదు. దాని ఫలితాలు రాబోయే స్థానిక సంస్థల, శాసనసభ ఎన్నికల్లో ప్రతిఫలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి