ఉపాధి వెతుక్కుంటూ నగరాలకు వలస వెళ్లే జీవులకు కేంద్ర ప్రభుత్వం ఓ మంచి సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. పనులు దొరికే వరకు పట్టణాల్లో ఉచితంగా భోజనం, ఆశ్రయం ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగరంలో రాణిగారితోట, గాంధీనగర్, వెహికల్ డిపో, విధ్యాధరపురం ప్రాంతాల్లో ఒక్కో చోట వంద పడకలు ఏర్పాటు చేశారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ద్వారా జాతీయ పట్టణ జీవనోపాధి పథకం కింద ఈ ఉచిత ఆశ్రయం అందుబాటులోకి వచ్చింది.
ఈ పథకం కింద ఉచిత భోజనం, టిఫిన్, బస ఏర్పాట్లు చేస్తారు. వసతి గృహంలో కొద్ది రోజులు ఉండవచ్చు. ఉపాధి లభించే వరకు అన్ని వసతులు కల్పిస్తారు. ఇందులో బస చేయాలనుకునే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది.
ప్రతి రోజూ వేలాది మంది పొట్టచేతపట్టుకుని పట్టణాలు, నగరాలకు ఉపాధి కోసం వలసలు వెళుతుంటారు. అయితే వారు ప్రైవేటు లాడ్జిల్లో బస చేయాలంటే ఖర్చు కూడుకున్న వ్యవహారం కావడంతో బస్టాండులు, పుట్ పాత్ల పక్కనే నిద్రిస్తుంటారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం వసతి కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చింది.
కూలీ పనులు, ఉపాధి వెతుక్కునేందుకు పట్టణాలు, నగరాలు చేరే వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంలో కొద్ది రోజులు పాటు ఆశ్రయం పొందవచ్చు. ఉపాధి దొరికిన తరవాత ఆయా ప్రాంతాలకు వెళ్లి పోవాల్సి ఉంటుంది. నెలల తరబడి ఉండేందుకు మాత్రం ఈ వసతి గృహాల్లో అనుమతించరు.