అయోధ్యలో అద్భుత ఘట్టం
సూర్యతిలకాన్ని దర్శించుకుని పరవశించిన భక్తులు
శ్రీరామచంద్రస్వామి వారి జన్మస్థలమైన యూపీలోని అయోద్యలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామదర్బారు భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం ఉదయానికే ఐదు లక్షల మంది భక్తులు చేరుకున్నారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్యలోని బాలక్ రాముణ్ణి దర్శించుకునే వేళలు పొడిగించారు. భక్తులకు 18 గంటలపాటు దర్శనమివ్వనున్నాడు. ఉదయం 5 గంటలకు తెరుచుకున్న ఆలయ తలుపులు రాత్రి 11 గంటల వరకూ తెరచి ఉంచుతారు.
మధ్యాహ్నం 12 గంటలకు సూర్య వంశస్థుడైన శ్రీరామునికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్దాడు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసి భక్తులు తరించారు. శ్రీరామ నామస్మరణతో అయోధ్య మార్మోగింది.
అయోధ్యలోని సుమారు ఎనిమిది వేల ఆలయాలు, మఠాలను శ్రీరామనవమి సందర్భంగా సుందరంగా అలంకరించారు. సరయూ తీరంలో నేటి సాయంత్రం రెండున్నర లక్షల దీపాలను వెలిగించనున్నారు.