శ్రీరామనవమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ నుంచి వేలాది భక్తులు తరలి వచ్చారు. స్వామి వారికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.
మిథిలా మండపంలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కల్యాణ పూజలు ప్రారంభించారు. 12 గంటల 30 నిమిషాలకు ముగిశాయి. వేద మంత్రోచ్ఛారణ మధ్య అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాములవారి శిరస్సుపై ఉంచారు. ఇది శుభముహూర్తం. జగత్ కల్యాణ శుభ సన్నివేశం. తలంబ్రాల వేడుక అనంతరం బ్రహ్మ బంధనం వేశారు. దీన్ని బ్రహ్మముడ అంటారు. పండితులు చతుర్వేదాలతో నూతన దంపతులకు ఆశీర్వచనం పలికారు. సాధారణంగా కల్యాణంలో రెండు సూత్రాలు ఉంటాయి. భక్త రామదాసు ఎంతో వాత్సల్యంతో తయారు
చేసిన పతకాన్ని కూడా కలిపి మూడు సూత్రాలను సీతమ్మవారికి ధరింపజేయడం ఆనవాయితీ.
అన్నమయ్య జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. ధ్వజారోహణంతో మొదలైన బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 14వ తేదీ వరకూ జరగనున్నాయి.ఇవాళ ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య శేష వాహనసేవ నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీరామనవమి, ఏప్రిల్ 9న హనుమత్సేవ, ఏప్రిల్ 10న గరుడసేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 11వ తేదీన సాయంత్రం ఆరున్నర నుంచి ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం జరగనుంది. అనంతరం గజ వాహనసేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 12న రథోత్సవరం, ఏప్రిల్ 14న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తారు.