ఇరాన్ కరెన్సీ నేల చూపులు చూస్తోంది. అమెరికా డాలరు విలువకు రియాల్ 10 లక్షల 43 వేలకు పతనమైంది. ఇరాన్ రియాల్ ఇంతగా పడిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. 2015లో అమెరికాతో ఇరాన్ అణుఒప్పందం చేసుకున్న సమయంలో డాలరుకు 32 వేల రియాల్స్ మారకం జరిగేది. తరవాత ఇరాన్ చేపట్టిన అణ్వస్త్ర కార్యక్రమం కారణంగా ఆ దేశంపై అగ్రరాజ్యం అనేక ఆంక్షలు విధించింది. దీని వల్ల ఇరాన్ వాణిజ్యం దెబ్బతిని కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఫిర్దౌసి వీధిలో కరెన్సీ మార్పిడి వ్యాపారం నిర్వహించే కార్యాలయాలు అధికంగా ఉన్నాయి. శనివారం కరెన్సీ పతనంతో దుకాణాలు మూతపడ్డాయి. అయితే అనధికారికంగా వీధుల్లో డాలరుకు రియాల్ మార్పిడి జరుపుతున్నారు.
అగ్రరాజ్య ఆంక్షలను దిక్కరించి ఇరాన్ చేపట్టిన అణ్వస్త్ర కార్యక్రమాలతో ఎగుమతులు దెబ్బతిన్నాయి. చివరకు చమురు ఎగుమతులపై కూడా అగ్రరాజ్యం నిషేధం విధించడంతో రియాల్ విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పతనమైంది.