ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ రాజధాని అమరావతి పర్యటనకు రానున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీ ఈ నెల మూడో వారంలో రానున్నారు. ప్రధాని పర్యటన కోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమానికి లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.
వెలగపూడి రాష్ట్ర సచివాలయం వెనుక ఉన్న 250 ఎకరాల్లో సభావేదిక ఏర్పాటు చేయనున్నారు. సామాన్యులతో పాటు వీవీఐపీలు, వీఐపీల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. సభాస్థలికి చేరుకునేందుకు మొత్తం 8 మార్గాలను గుర్తించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్ ఏర్పాటు…
ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మీద నుంచి వెళ్లే ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలవనున్నారు. భూసేకరణ దాదాపు కొలిక్కి రావడంతో తొలుత 27 కిలోమీటర్ల ట్రాక్‌తోపాటు కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు.
కాజీపేట-విజయవాడ లైన్‌లోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి మొదలయ్యే ఈ లైన్ అమరావతి మీదుగా గుంటూరు జిల్లా నంబూరు వద్ద విజయవాడ-గుంటూరు లైన్‌లో కలుస్తుంది. ట్రాక్ పొడవు 57 కిలోమీటర్లు.
27 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 450 కోట్లు, కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మాణానికి రూ.350 కోట్లు ఖర్చు చేయనున్నారు. ట్రాక్ నిర్మాణం రెండేళ్లలోవంతెన నిర్మాణానికి మూడేళ్లు పడుతుందని రైల్వేశాఖ చెబుతోంది.
అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి కూడా టెండర్లు పిలువనున్నారు.