ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు కోడింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తోంది. విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసుకునే లోగా కోడింగ్‌లో పట్టు సాధించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు పెంపొందించేందుకు దేశంలోని 8 రాష్ట్రాల్లో ఉచిత శిక్షణ ప్రారంభించింది. కోడింగ్ నేర్చుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఉపాధ్యాయులకు కూడా ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తోంది. కోడింగ్ నేర్చుకుంటూనే ఉపాధ్యాయులు వారి తరగతుల్లోని విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తున్నారు.
అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ పేరిట ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం గత ఏడాది ప్రారంభమైంది. క్వెస్ట్ అలయన్స్ సంస్థ సహకారంతో సమగ్ర శిక్ష లీడర్షిప్ ఫర్ ఈక్విటీ ద్వారా ఉచిత శిక్షణకు గత ఏడాది అమెజాన్‌తో ఒప్పందం చేసుకున్నారు. ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 248 ఉపాధ్యాయులు, 7381 విద్యార్థులకు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో ఉచిత శిక్షణ ప్రారంభించారు.
తొలి ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు విశాఖలో హ్యాకథాన్ నిర్వహించారు. పోటీలకు వచ్చిన విద్యార్ధులకు స్టార్ హోటల్లో వసతి కల్పించారు. విజేతలకు ట్యాబులు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు బహుమతులుగా ఇచ్చి ప్రోత్సహించారు.
కోడింగ్ అనగానే ఇదేదో అర్థంకాని భాష అని భయపడాల్సిన పనిలేదని శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు చెపుతున్నారు. కోడింగ్ నేర్చుకున్న తరవాత సాంఘికశాస్త్రం నుంచి తెలుగు వరకు అన్ని సబ్జెక్టుల పాఠాలు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా చెబుతున్నట్లు శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
స్క్రాచ్ కోడింగ్ ఫ్లాట్‌ఫాం ద్వారా అనారోగ్య సమస్యలు వాటి కారణాలను విశ్లేషణ చేస్తూ ఎనిమిదో తరగతి విద్యార్థి చైతన్య ఓ ఆన్లైన్ గేమ్ రూపొందించారు. మరికొందరు విద్యార్థులు కోడింగ్ ఉపయోగించి ఈవ్‌టీజింగ్ సమస్యకు యానిమేషన్ రూపంలో పరిష్కారాలను సూచించారు. కంప్యూటర్ నైపుణ్యాలను నేర్పడం వల్ల పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాలు పెరుగుతాయని ఉపాధ్యాయులు చెప్పారు. రాబోయే మూడేళ్లలో ఏపీలో ఐదువేల ఉపాధ్యాయులు, 50 వేల మంది విద్యార్థులకు కోడింగ్, ఏఐ నైపుణ్యాలను నేర్పించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు.