అరుదైన సాంకేతికతతో దేశంలో తొలిసారిగా నిర్మించిన పంబన్ బ్రిడ్జి నిర్మాణంలో ఓ తెలుగు వ్యక్తి కీలక భాగస్వామిగా ఉన్నాడు.
తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరిధిలో రూ.535 కోట్లతో పంబన్ వంతెన నిర్మించారు. నేడు దీనిని ప్రధాని మోదీ జాతికి అంకితమిస్తున్నారు. ఈ సేతు నిర్మాణంలో ఇన్‌ఛార్జిగా విజయనగరం జిల్లా గుర్ల మండలం భూపాలపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువ ఇంజినీర్ నడుపూరు వెంకట చక్రధర్ వ్యవహరించాడు.
ఉపాధ్యాయుల కుటుంబంలో జన్మించిన వెంకట చక్రధర్, చిన్నతనం నిర్మాణరంగంపై ఆసక్తి చూపుతుండేవాడు. దీంతో తితో బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చేశాడు. ఆ తర్వాత ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) కోసం శిక్షణ తీసుకున్నాడు. ఆ సమయంలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ వెలువడటంతో అందుకు ఎంపికై, రైల్వేలో బ్రిడ్జి విభాగం ఆప్షన్‌ను ఎంచుకుని ఉద్యోగంలో చేరాడు.
తొలి పోస్టింగ్ లో భాగంగా చెన్నైలో పనిచేసిన వెంకట చక్రధర్, కొద్దికాలంలోనే సీనియర్ ఇంజినీర్‌గా ఉద్యోగోన్నతి సాధించాడు. రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించేలా సముద్రంపై నిర్మించిన పాత పంబన్ వంతెన అవసాన దశకు చేరడంతో, దాని స్థానంలో ప్రభుత్వం కొత్త వంతెన నిర్మించింది. ఆ నిర్మాణంలో
సీనియర్ సెక్షన్ ఇంజినీర్ హోదాలో ఇన్‌ఛార్జిగా చక్రధర్ సేవలు అందించాడు. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగమైనందుకు ఆనందంగా ఉందని చక్రధర్ అంటున్నారు. వంతెన నిర్మాణంలో వందల మంది నిపుణులు, శ్రామికులు రేయింబవళ్లూ శ్రమించారని గుర్తు చేసుకున్నారు. ఏడాదిగా స్వగ్రామానికి, బంధువుల శుభకార్యాలకూ వెళ్లలేకపోయానని చక్రధర్ తెలిపారు. సెలవలు లేకుండా పనిచేసినందుకు ప్రతిరూపంగా పంబన్ సేతు సాకారమైందన్నారు.