ఐపీఎల్-2025 లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నై జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి. 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై… 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది.దీంతో 25 పరుగుల తేడాతో దిల్లీ జట్టు విజయం సాధించింది.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో దిల్లీ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయ 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ అందుబాటులో లేకపోవడంతో లో ఓపెనర్ గా క్రీజులోకి అడుగు పెట్టిన కేఎల్ రాహల్, క్లాసిక్ షాట్లతో చెన్నై బౌలర్లను ఎదుర్కొన్నాడు. 51 బంతులు ఆడి 77 పరుగులు చేశాడు. తోటి ఓపెనర్ ఫ్రేజర్ మెక్ గుర్క్ (0) డకౌట్ అయినా రాహుల్ మాత్రం నిలకడగా ఆడాడు. అభిషేక్ పోరెల్ (33), కెప్టెన్ అక్షర్ పటేల్ (21), సమీర్ రిజ్వి (24) రాణించారు. ట్రిస్టాన్ స్టబ్స్ 24 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఖలీల్ అహ్మద్ రెండు, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీశ్ పతిరిన తలా ఒక వికెట్ తీశారు.
లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ విఫలమైంది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (3), డెవాన్ కాన్వే (13), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (5) విఫలమయ్యారు. 9 ఓవర్లలోనే 3 వికెట్లు నష్టపోయి 59 పరుగులు మాత్రమే చేయగల్గింది. విజయ శంకర్ 54 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. శివమ్ దూబే(18), రవీంద్ర జడేజా(2) విఫలమయ్యారు. ఎంఎస్ ధోని 26 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలిపోయాడు. ఈ మ్యాచ్ చూసేందుకు దోని తల్లిదండ్రులు, భార్య, బిడ్డతో పాటు ఇతర కుటంబ సభ్యులు వచ్చారు.
దిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ కు రెండు, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, మిచెల్ స్టార్ లకు తలా ఒక వికెట్ దక్కింది.