వక్ఫ్ సవరణ బిల్లు 2025లో గిరిజన భూములను రక్షించినందుకు వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ అభినందనలు తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్ళ ప్రకారం గిరిజన భూములు రక్షించబడతాయి అని స్పష్టం చేసారు.
వక్ఫ్ బిల్లు ప్రకారం భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ, సంబంధిత విభాగాలకు చెందిన భూములను కూడా పౌరుల వ్యక్తిగత ఆస్తులలానే పరిగణించి వాటికి భద్రత కల్పించడం జరుగుతుంది.
అమిత్ షా ఇంకా స్పష్టంగా వివరణ ఇచ్చారు. ఎవరైనా ఒక వ్యక్తి తన సొంత ఆస్తిని దానం చేయగలడు. అంటే యాజమాన్యం చూపించకుండా వక్ఫ్ ఏదైనా ప్రైవేటు ఆస్తిని స్వాధీనం చేసుకోలేదు.
‘‘ఈ బిల్లు భూములకు రక్షణ కల్పిస్తుంది. వక్ఫ్ బోర్డు ప్రకటన చేసేసినంత మాత్రాన ఏ ఒక్కరి భూమీ వక్ఫ్ ఆస్తి అయిపోదు. మేము ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి భూములకు రక్షణ ఇస్తాము. షెడ్యూలు 5,6లలో పేర్కొన్న గిరిజనుల భూములకూ రక్షణ ఉంటుంది. సాధారణ పౌరుల ప్రైవేటు ఆస్తికి కూడా రక్షణ ఉంటుంది. వక్ఫ్‌కు ఏదైనా ఆస్తిని ఎవరైనా దానం చేయాలంటే దానిపై వారికి యాజమాన్య హక్కు ఉండితీరాల్సిందే. మీరు మీ ఆస్తిని మాత్రమే దానం చేయగలరు, ఊరి ఆస్తిని కాదు’’ అని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు.
గిరిజన భూములకు రక్షణ కల్పించినందుకు భారత ప్రభుత్వానికి వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ ధన్యవాదాలు చెప్పింది. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ముందు తమ అభిప్రాయాలు చెప్పామని వెల్లడించింది. అంతకంటె చాలా ముందే గిరిజనుల భూములకు రక్షణ తప్పనిసరి అన్న డిమాండ్లతో ఉద్యమాలు చేసినట్లు గుర్తు చేసుకుంది.
‘‘గత పదిహేనేళ్ళుగా వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ నిరంతరాయంగా చేస్తున్న ప్రయత్నాల ఫలితమిది. అంతకుముందు, వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ ఉమ్మడి పార్లమెంటరీ కమిటీకి దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి గురించి ఎక్కడికక్కడ మెమొరాండాలు సమర్పించింది. అందుకే, వక్ఫ్ బిల్లులో గిరిజన భూముల రక్షణ కోసం ఏర్పాట్లు చేయాలని జేపీసీ తన నివేదికలో సిఫారసు చేసింది’’ అని వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ తమ ప్రకటనలో చెప్పుకొచ్చింది.
‘‘రాజ్యాంగంలోని 5,6 షెడ్యూళ్ళ ప్రకారం గిరిజన ప్రాంతాలుగా నిర్ధారించబడిన చోట్లలోనే గణనీయమైన మొత్తంలో వక్ఫ్ భూములు, ఆస్తులు రిజిస్టర్ అయ్యాయి. అది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఆ విషయం తెలిసాకే జేపీసీ ప్రభుత్వానికి తన నివేదికలో, వక్ఫ్ బిల్లులో గిరిజన భూముల రక్షణకు ప్రొవిజన్లు కల్పించాలని సిఫారసు చేసింది’’ అని వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ జాతీయ అధ్యక్షుడు సత్యేంద్ర సింగ్ చెప్పారు.
బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ ఏప్రిల్ 3న ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు పెట్టారు. అందులో, వక్ఫ్ ఆక్రమణల నుంచి చారిత్రక కట్టడాలను, స్మారక నిర్మాణాలను, గిరిజన భూములను రక్షించడానికి వక్ఫ్ బిల్లులో 3డి, 3ఇ అనే రెండు అంశాలను కొత్తగా చేర్చామని వెల్లడించారు.
‘‘ఏదైనా ఒక ప్రదేశం ప్రాచీన స్మారకాల పరిరక్షణ చట్టం 1904 లేదా ప్రాచీన స్మారకాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం రక్షిత చారిత్రక కట్టడం లేదా రక్షిత ప్రదేశం అయితే… అలాంటి ప్రదేశాన్ని ఈ చట్టం లేదా వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఏ పాత చట్టం ప్రకారమైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం లేదా నోటిఫై చేయడం చెల్లదు’’ అని 3డి పాయింట్ చెబుతుంది.
ఈ పాయింట్ వల్ల ఎఎస్ఐ రక్షిత నిర్మాణాలు, స్మారకాలూ వక్ఫ్ పరిధిలోనుంచి తొలగించబడతాయి. అలాంటి నిర్మాణాలకు ఎఎస్ఐ కేవలం సంరక్షకురాలు మాత్రమే, అటువంటి ఆస్తులు కచ్చితంగా ప్రభుత్వ ఆస్తులే అవవలసిన అవసరం లేదు అని అమిత్ మాలవీయ వివరించారు.
అలాగే, షెడ్యూల్డు తెగలకు చెందిన భూములను కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం సాధ్యం కాదని పాయింట్ 3ఇ స్పష్టం చేస్తుంది. ‘‘ఈ బిల్లులో కానీ, ఇప్పటికే అమల్లో ఉన్న మరే ఇతర చట్టంలో కానీ ఏమున్నప్పటికీ, భారత రాజ్యాంగంలోని 5,6 షెడ్యూళ్ళలోని అంశాల ప్రకారం షెడ్యూల్డు తెగల ప్రజలకు సంబంధించిన ఏ భూమినీ వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి వీలు లేదు’’ అని ఆ పాయింట్ చెబుతోంది.
ఆ అంశం గురించి వివరిస్తూ ‘‘వక్ఫ్ పరిధి నుంచి గిరిజన భూములను తప్పించడం ద్వారా గిరిజన తెగల ప్రయోజనాలు కాపాడబడతాయి. వారి భూముల ఆక్రమణను నిరోధించవచ్చు. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి గిరిజన ఆధిక్యం కలిగిన ప్రదేశాల్లో, గిరిజనుల ఆస్తులు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడడంలో ఇది కీలకమైన అంశం. గిరిజనుల హక్కులను రక్షించడంలో ఇదొక గొప్ప ముందడుగు. బెంగాల్ సహా పలు ప్రాంతాల్లోని గిరిజనులకు లబ్ధి చేకూరుస్తుంది’’ అని అమిత్ మాలవీయ చెప్పుకొచ్చారు.
వక్ఫ్ సవరణ బిల్లు 2025 ఏప్రిల్ 2న లోక్‌సభలో 288-232 ఓట్ల ఆధిక్యంతో ఆమోదం పొందింది. అలాగే 2025 ఏప్రిల్ 3న రాజ్యసభలో 128-95 ఓట్ల ఆధిక్యంతో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకం అనే లాంఛనం పూర్తి కాగానే ఈ బిల్లు చట్టరూపం దాలుస్తుంది.