శ్రీలంక పర్యటనకు వెళ్ళిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే, మోదీకి ‘శ్రీలంక మిత్ర విభూషణ’ పురస్కారం అందజేశారు. ఇక రెండు దేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు శ్రీలంక తూర్పు ప్రాంతానికి భారత్ గ్రాంట్ అందించడం వంటి ఒప్పందాలు జరిగాయి. సాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును ఇరువురు నేతలు వర్చువల్గా ప్రారంభించారు.
ద్వైపాక్షిక చర్చల అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ, ‘2019లో జరిగిన ఉగ్రదాడి, కొవిడ్ మహమ్మారి, ఇటీవలి ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు భారత్ సాయం అందించిందన్నారు. రెండు దేశాల భద్రతా ప్రయోజనాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు.
మత్స్యకారుల సమస్యపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. శ్రీలంక ప్రభుత్వం తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నామన్నారు. భారత ప్రయోజనాల విషయంలో అధ్యక్షుడు సానుకూలంగా స్పందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక భూభాగాన్ని వినియోగించనివ్వబోమని ఆ దేశాధ్యక్షుడు తెలిపారు. క్లిష్ట సమయాల్లో న్యూదిల్లీ అందిస్తోన్న సహకారం ఎంతో విలువైనది అని అనుర కుమార దిసనాయకే పేర్కొన్నారు.