దంతేవాడలో అమిత్ షా పర్యటన
పాండుం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి
వచ్చే నవరాత్రుల నాటికి ఎర్ర బీభత్సం అంతం అవుతుందని వ్యాఖ్య
కేంద్ర హోంమంత్రి ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్ట్ ప్రభావిత జిల్లా దంతేవాడలో పర్యటించారు. దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకుని, పాండుం ముగింపు సభలో మాట్లాడారు. తాను దంతేశ్వరి మాత ఆశీస్సులు పొందానన్న అమిత్ షా, వచ్చే నవరాత్రి నాటికి ఎర్ర బీభత్సం అంతం కావాలన్నారు.
బస్తర్ గొప్ప గిరిజన సంస్కృతిని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పే పాండుం ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకోలేరన్న అమిత్ షా, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులను కోరారు.
ప్రధాని మోదీ నుంచి తానొక సందేశం తెచ్చానని తెలిపిన అమిత్ షా, వచ్చే ఏడాది దేశంలోని ప్రతీ గిరిజన జిల్లా నుంచి కళాకారులను ఒకే పేరుతో బస్తర్ పాండుం ఉత్సవాలకు తీసుకొస్తామన్నారు. బస్తర్ పాండుంకు అంతర్జాతీయ హోదా కల్పించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రపంచం నలుమూలల నుంచి రాయబారులను తీసుకొస్తుందన్నారు.