అస్సాంలో జరిగిన ట్రైబల్ అటానమస్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్‌కు ఘోర పరాభవమే మిగిలింది.
రభా హసాంగ్ అటానమస్ కౌన్సిల్‌లోని 36 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 33 స్థానాల్లో ఎన్‌డీఏ అభ్యర్ధులే విజయం సాధించారు. రెండు స్థానాలు స్వతంత్ర అభ్యర్ధులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే ఒక సీటు దక్కించుకోగలిగింది. అస్సాంలో గిరిజనుల ప్రాబల్య ప్రాంతంలో ఈ విజయం అధికార కూటమికి నైతిక స్థైర్యాన్ని మరింత పెంచింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న అస్సాం గిరిజనులు ఆ విశ్వాసాన్ని ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేకించి ఈశాన్య భారత ప్రాంతంలోని స్వదేశీ గిరిజన తెగలను అభివృద్ధి చేయడం ద్వారా వారి ఆదరణను పొందాలన్న బీజేపీ ప్రయత్నాలు ఫలించినట్లే అని అంచనా వేస్తున్నారు.
ఈ ఎన్నికలు అస్సాంలో బీజేపీ-ఎన్‌డీఏ ఆధిక్యతను చాటాయి, అంతేకాదు, వచ్చే నెల జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్‌డీఏ కూటమి విజయానికి బాటలు వేసాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హర్షం వ్యక్తం చేసారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘అస్సాంలో మరోసారి కాషాయ ప్రభంజనం. రభా హసాంగ్ అటానమస్ కౌన్సిల్‌లోని ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ, ప్రత్యేకించి స్వదేశీ తెగల వారు, ఒకే మాట మీద నిలబడ్డారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ విధానాలపై మీ సంతృప్తిని ప్రకటించారు. ఎన్‌డీయే కూటమి 36 స్థానాల్లో 33 స్థానాలను గెలుచుకుంది’’ అని ట్వీట్ చేసారు.
ఈశాన్య భారతంలోని గిరిజన ప్రాంతాల్లోకి బీజేపీ చొచ్చుకుపోతోందని ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. మరోవైపు, వరుస పరాజయాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌కు ఈ ఓటమి మరో శిరోభారంగా మిగిలింది. క్షేత్రస్థాయిలో పార్టీ పూర్తిస్థాయిలో బలహీనపడిపోయిన సంగతికి ఈ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి. ‘‘గిరిజనులు, యువతరం బీజేపీ అభివృద్ధి అజెండాకు ఆకర్షితులు అవుతున్నారు. వారిని ఆకట్టుకోవడంలో మేం విఫలం అయ్యాం’’ అని, పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పుకొచ్చారు.