వక్ఫ్ బిల్లుపై సరైన చర్చ జరగలేదంటూ సోనియా గాంధీ చేసిన ఆరోపణలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తిప్పికొట్టారు. అసలు ఉభయ సభల్లో చర్చ జరుగుతున్న సమయంలో సోనియా, రాహుల్, ప్రియాంకల్లో ఏ ఒక్కరైనా పార్లమెంటులో ఉన్నారా అని నిలదీసారు. వక్ఫ్ బిల్లు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సభ బైట అవాకులూ చెవాకులూ పేలుతూ బీజేపీపై అపవాదులు వేయడం సరికాదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ లోక్‌సభలో ఒకలా, రాజ్యసభలో మరొకలా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
ముస్లిముల గురించి అందరూ మాటలకు పరిమితమైతే, వారి అభివృద్ధి కోసం నిజంగా పనిచేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. పేద ముస్లిములకు మేలు చేసే వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభలోనూ రాజ్యసభలోనూ ఆమోదం సాధించామని చెప్పారు. మోదీ సారధ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అసాధ్యాలను సుసాధ్యం చేసిందని ఆమె వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్‌ను తొలగించడం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛను ఇచ్చింది మోదీ ప్రభుత్వమేనని గుర్తు చేసారు.