ఉత్తరప్రదేశ్‌లో ఇస్లాంకు బలమైన కేంద్రస్థానంగా నిలిచిన దేవబంద్‌లో పదిమంది సభ్యులున్న ముస్లిం కుటుంబం హిందూమతంలోకి ఘర్‌వాపసీ అయింది. దాదాపు యాభై ఏళ్ళ క్రితం తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్లాంలోకి మతం మారిన కుటుంబం ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చింది.
బాగ్రాలోని యోగ సాధన యశ్‌వీర్ ఆశ్రమంలో ఈ ఘర్‌వాపసీ కార్యక్రమం నిర్వహించారు. వేదమంత్రాలతో శుద్ధీకరణ యజ్ఞం చేపట్టారు. పీఠాధీశ్వరులు యోగి యశ్‌వీర్ మహరాజ్ ఆధ్వర్యంలో ఆచార్య మృగేంద్ర బ్రహ్మచారి శుద్ధీకరణ తంతు నడిపించారు. తర్వాత వారి ముస్లిం పేర్లకు బదులుగా కొత్త హిందూ పేర్లతో నామకరణం జరిగింది. ఇంటిపెద్ద ఫామీదా పేరు రాజకుమారి కాశ్యప్‌గా మార్చారు. ఆమె కుమారుడు దిల్‌జాన్ పేరు బ్రజేష్ కాశ్యప్‌గా మారింది. రేష్మా పేరు పూజా అయింది, పాలక్ పేరు సవిత, మెహక్ పేరు కవిత, ఆలియా పేరు పాయల్, సనా పేరు సోనియా, ఖుస్‌నుమా పేరు సాధనగా మారాయి. అర్మాన్‌కు అమిత్ కాశ్యప్ అని, ఇస్లామ్‌కు విక్రమ్ సింగ్ అని నామకరణం జరిగింది.
ఆ సందర్భంగా యోగి యశ్‌వీర్ మాట్లాడుతూ అర్ధశతాబ్దం క్రతం ఒత్తిళ్ళకు లోనై ఇస్లాంలోకి మారిన కుటుంబం, ఈ యేడాది రంజాన్ పండుగ జరిగిన కొన్ని రోజులకే స్వధర్మంలోకి తిరిగి రావడం విశేషం అన్నారు. ఇది మతమార్పిడి కాదని, ఆ కుటుంబం తన మూలాలను తిరిగి చేరుకుందనీ వివరించారు. చరిత్రలో చాలామంది బలవంతంగా సనాతన ధర్మాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. ఇవాళ ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. అందువల్ల ప్రజలు తమ వారసత్వాన్ని తిరిగి చేపడుతున్నారు అని యశ్‌వీర్ వివరించారు.
ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మంలోకి ప్రవేశించిన కుటుంబం సంతోషంతో పాటు గొప్ప ఉపశమనం పొందామని వెల్లడించింది. ఇస్లాం మతంతో తాము ఎప్పుడూ ఆత్మికమైన బంధాన్ని పొందలేకపోయామని చెప్పారు. తమ పూర్వీకులు అనుసరించిన సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నామని, ఇన్నాళ్ళకు అది సాధ్యమయిందనీ వివరించారు. ఆ కుటుంబం ఇకపై పూర్తిగా సనాతన సంప్రదాయాలతో హిందువులుగా జీవించడానికి సిద్ధమైంది.