అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమల్లోకి తెచ్చిన పరస్పర సుంకాల ప్రభావం మొదలైంది. ఏప్రిల్ 5 నుంచి అమెరికాలో పెరిగిన సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేందుకు అమెరికా పౌరులు స్టోర్ల వద్ద క్యూ కడుతున్నారు. ముఖ్యంగా తైవాన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 32 శాతం సుంకం వేయడంతో కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాపులు, మొబైల్స్, ట్యాబుల ధరలు భారీగా పెరగనున్నాయి. దీంతో అమెరికా పౌరులు తైవాన్ ఉత్పత్తులను పాత ధరలకు దక్కించుకునేందుకు ఎలక్ట్రానిక్ స్టోర్ల వద్ద క్యూ కట్టారు.
పెంచిన సుంకాలు ఏఫ్రిల్ 5 అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల వద్ద బేస్ సుంకం 10 శాతం వసూలు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై చైనా, తైవాన్, జపాన్, యూరోపియన్ దేశాలు కూడా సుంకాలను 24 నుంచి 34 శాతం వరకూ పెంచాయి. వీటి ప్రభావంతో అమెరికాలో దిగుమతి వస్తువుల ధరల 25 శాతంపైగా పెరిగే అవకాశముంది.
అమెరికాలో ఇప్పటికే ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పలు దేశాలు పెంచిన సుంకాలతో ధరలు మరింత ఎగబాకనున్నాయి. నిరుద్యోగ రేటు కూడా ఆందోళన కలిగిస్తోందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి పెరగకపోగా వివిధ రకాల వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరుగుతాయని, ఇది అమెరికా పౌరులకు పెనుభారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.