విశ్వావసు నామ సంవత్సర వసంత నవరాత్రుల్లో ఏడవ రోజు సందర్భంగా ఇవాళ ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గ అమ్మవారికి మంత్రపూర్వకంగా ప్రత్యేక పుష్పార్చన జరిగింది. ఎర్ర తామర పూలు, ఎర్ర గన్నేరు పూలు, సన్న జాజులతో పుష్పార్చన నిర్వహించారు. అమ్మవారి ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకులు, సిబ్బంది అర్చన ప్రాంగణానికి వెదురు బుట్టలతో పూలు తీసుకొని వెళ్ళారు.
మరోవైపు, చైత్ర శుద్ధ అష్టమి సందర్భంగా ఇవాళ ఇంద్ర కీలాద్రి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల్లో కొలువైన ఆంజనేయ స్వామికి అభిషేకాలు, నాగవల్లీ దళార్చనలూ జరిగాయి.