భారతదేశంలో మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరిధిలో రూ.535 కోట్లతో నిర్మించిన పంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , రేపు (ఏప్రిల్ 6న) జాతికి అంకితం ఇవ్వనున్నారు.
శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12.45 సమయంలో ప్రధాని పంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెనను ప్రారంభిస్తారు. ఆ తర్వాత రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు రాకపోకలు సాగించనుంది. ఈ ప్రాజెక్టుకు రైల్వే శాఖ తరఫున తెలుగువాడైన నడుపూరు వెంకట చక్రధర్ సీనియర్ ఇంజినీర్ హోదాలో ఇన్ఛార్జిగా ఉన్నారు.
పంబన్ బ్రిడ్జికి 2019 మార్చి 1న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్)2020లో పనులు చేపట్టి, నాలుగేళ్ల కాలంలోనే పూర్తిచేసింది. వెర్టికల్ లిఫ్ట్ ను 600 మీటర్ల దూరంలోని ప్రతిపాదిత చోటుకు తీసుకెళ్లేందుకు 5 నెలల సమయం పట్టింది. 660 టన్నుల బరువు గల ఈ లిఫ్ట్ ను లాంఛింగ్ గర్డర్లు, బేరింగుల సాయంతో పట్టాలపైకి ఎక్కించి, రోజూ కొంతదూరం కదిలించి తరలించారు.
సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా వెర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ కు రెండు వైపులా నిలువు స్తంభాలు ఏర్పాటు చేయగా వాటికి 310-320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతుంటాయి. ఈ దూలాల బరువు 625 టన్నులు. లిఫ్ట్‌లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి విద్యుత్ ను ఉపయోగిస్తారు. మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి. 2.08 కి.మీ పొడవైన వంతెనలో 99 దిమ్మెలు 18.3 మీటర్ల పొడవుతో నిర్మించారు. సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకూ 25 నుంచి 35 మీటర్ల లోతున పునాదులు తీశారు.
వంతెన తుప్పు పట్టకుండా మూడు పొరలుగా పాలీసిలోక్సేన్ రంగు వేశారు. 58 ఏళ్ల వరకు తుప్పు సమస్య రాదు. గంటకు 58 కి.మీ. వేగానికి మించి గాలులు వీస్తే స్కాడా దానంతట అదే ఈ మార్గాన్ని మూసివేస్తుంది. మత్స్యకారుల పడవలు, బార్జ్ పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది దిమ్మెల పైనున్న గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు.