తాజాగా ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో ఓ చర్చ సందర్భంలో కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అబద్ధాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బట్టబయలు చేసారు. 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన దాడులను దిగ్విజయ్ సింగ్ ఆర్ఎస్ఎస్ కుట్రగా ప్రచారం చేసారు. ఆ విషయాన్ని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేదీ ఎవరి పేరూ చెప్పకుండా ప్రస్తావించారు. దాన్ని వెంటనే దిగ్విజయ్ సింగ్ ఖండించారు. దాన్నిబట్టే దిగ్విజయ్ ఏం చేసారో అర్ధమవుతోందంటూ అమిత్ షా చురకలు అంటించారు. తాను అనని మాటలను తనకు ఆపాదిస్తున్నారంటూ దిగ్విజయ్ సమర్ధించుకునే ప్రయత్నం చేసారు. అయితే ఆ వాదాన్ని అమిత్ షా పూర్వపక్షం చేసారు.
సంఘ్ మీద దిగ్విజయ్ అబద్ధాల కథ ఏంటి?
భారత ఆర్థిక రాజధాని ముంబైపై 26/11న జరిగిన దాడులకు పాకిస్తాన్ బాధ్యురాలని ప్రపంచం మొత్తం గుర్తించింది. కానీ కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీకి సన్నిహితులైన వారూ ఆ దాడులు చేయించింది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘమే అంటూ కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేసారు. పాకిస్తాన్ నుంచి దొంగచాటుగా వచ్చిన ఉగ్రవాదులు చేసిన దాడులను కాషాయ ఉగ్రవాదం అంటూ కట్టుకథలల్లి ఆ దాడులకు ఆర్ఎస్ఎస్సే దోషి అని దుష్ప్రచారం చేసినది కాంగ్రెస్ నాయకులే అన్న సంగతి ఇప్పుడు ప్రపంచం అంతటికీ తెలుసు.
హిందూ వ్యతిరేక భావనలకు, విద్వేష ప్రసంగాలకూ పెట్టింది పేరయిన అజీజ్ బర్నీ అనే వ్యక్తి సహారా గ్రూప్ మీడియాలో సంపాదకుడిగా పని చేసేవాడు. 26/11 దాడులకు సంఘాన్ని దోషిగా నిలబెట్టాలన్న కాంగ్రెస్ కుట్రలో భాగంగా అతను రకరకాల కథనాలను వండి వార్చాడు. రోజ్నామా సహారా, బజ్మ్-ఎ-సహారా, ఆలమీ సహారా వంటి సహారా సంస్థ ప్రచురణలకు, సహారా ఉర్దూ దినపత్రికకూ అతను సంపాదకుడిగా ఉండేవాడు. ఆ అజీజ్ బర్నీ ‘‘26/11 ఆర్ఎస్ఎస్ కుట్రా?’’ అంటూ ఏకంగా ఒక పుస్తకమే రాసిపడేసాడు. ఆ రచనకు విశ్వసనీయత కల్పించడం కోసం కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ రచనను ఒకటి కాదు రెండు సార్లు ఆవిష్కరించారు. ఢిల్లీ, ముంబై నగరాల్లో ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు దిగ్విజయ్ సింగ్ అబద్ధాలు వండి వార్చారు.
2008 నవంబర్ 26న ముంబైపై దాడులు జరగడానికి రెండు గంటల ముందు తనకు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే నుంచి ఫోన్ కాల్ వచ్చిందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అదే యేడాది సెప్టెంబర్ 20న మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుడు సంఘటనపై ఏటీఎస్ చేస్తున్న దర్యాప్తును వ్యతిరేకిస్తున్న వారి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని కర్కరే చెప్పారట. ఆ బెదిరింపులకు పాల్పడిన వాళ్ళు హిందూ కాషాయ ఉగ్రవాదులే అని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అలా 26/11 దాడుల నేరాన్ని హిందూ ఉగ్రవాదులు అనే కల్పిత పాత్రధారులు, ఆర్ఎస్ఎస్ మీదకూ నెట్టేసిన డిగ్గీరాజా పాకిస్తాన్‌కు క్లీన్చిట్ ఇచ్చేసారు.
26/11 దాడుల తర్వాత అజీజ్ బర్నీ సహారా గ్రూప్ ప్రచురణల్లో భారతదేశానికి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా అబద్ధాలు రాసుకొచ్చారు. వాటికి వ్యతిరేకంగా 2009 ఆగస్టులో ముంబై సెషన్స్ కోర్టులో కేసు దాఖలైంది. అజీజ్ బర్నీ, సహారా గ్రూప్ ఉర్దూ, హిందీ పత్రికల్లో 26/11 దాడుల గురించి నిరంతరాయంగా కట్టుకథలు అల్లారు. ఆ దాడుల కుట్ర చేసింది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థే అంటూ ఆరోపణలు చేసారు. పాకిస్తాన్ మద్దతుతో ఆ దేశం కేంద్రంగా పనిచేసిన జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులే 26/11 దాడి చేసారని స్పష్టంగా తెలుస్తున్నా, అజీజ్ బర్నీ అదే తప్పుడు ప్రచారాన్ని కొనసాగించాడు. ఆనాటి దాడుల్లో 175 కంటె ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు, 300 కంటె ఎక్కువ మంది గాయపడ్డారు.
26/11 దాడుల గురించి అజీజ్ బర్నీ చేసిన తప్పుడు ఆరోపణలతో ముంబై నగరానికి చెందిన వినయ్ జోషి అనే సామాజిక కార్యకర్త తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేసారన్న ఆరోపణలతో అజీజ్ బర్నీ మీద కేసు పెట్టారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇదే అజీజ్ బర్నీకి రాజ్యసభ టికెట్ ఇవ్వాలని కూడా ప్రయత్నించింది.
ఏడాది తర్వాత, ముంబైపై ఉగ్రదాడులకు ఆరెస్సెస్‌ను బాధ్యురాలిని చేస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేసినందుకు క్షమాపణలు కోరుతూ తమ పత్రిక మొదటి పేజీలో ప్రచురించారు. అయితే అజీజ్ బర్నీ క్షమాపణలను సంఘ్ తిరస్కరించింది. అజీజ్ బర్నీ చేసిన తప్పుడు ఆరోపణలకు సమర్ధనగా ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా లేదని కోర్టు విచారణలో తేలింది. ఆ నేపథ్యంలో అజీజ్ బర్నీ తన పుస్తకం పేరు మార్చడానికి కూడా సిద్ధపడ్డాడు.
దిగ్విజయ్ దుష్టత్వాన్ని బట్టబయలు చేసిన అమిత్ షా:
అలా, నిర్దిష్టమైన కుట్రతో ముంబైపై దాడులు చేయించింది ఆర్ఎస్ఎస్ అనే దుష్ప్రచారం చేసి పాకిస్తాన్‌ను నిర్దోషిగా చిత్రీకరించే ప్రయత్నంలో దిగ్విజయ్ సింగ్ భాగస్వామిగా ఉన్నారు. కాషాయ ఉగ్రవాదం అనే తప్పుడు సిద్ధాంతాన్ని దేశం మీద రుద్దింది ఆయనే. ఇప్పుడు తను అలాంటివేమీ మాట్లాడలేదంటూ దిగ్విజయ్ సింగ్ పార్లమెంటులోనే అబద్ధాలు చెప్పారు. అయితే డిగ్గీరాజా అబద్ధాల కథలను సుధాంశు త్రివేది, అమిత్ షా బట్టబయలు చేసారు.