ఏప్రిల్ 6న ధ్వజారోహణం…శేష వాహనసేవ
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రం అంకురార్పణ జరగనుంది. ఏప్రిల్ 6 నుంచిడి 14 వరకు స్వామివారికి రంగరంగ వైభవంగా వాహనసేవలు నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 11న సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవుతారు.
టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారుడు రాజేష్‌కుమార్ ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు నిర్వహించనున్నారు.
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో ప్రారంభం అవుతాయి. ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుంచి9 గంటల వరకు శేష వాహనసేవ ఉంటుంది. ఏప్రిల్ 9న హనుమత్సేవ, ఏప్రిల్ 10న గరుడసేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు గజ వాహనసేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 12న రథోత్సవం తో వాహన సేవలు ముగుస్తాయి.
ఏప్రిల్ 14న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఏప్రిల్ 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు.