లక్ష్యాన్ని చేరుకునేందుకు పేదరికం అడ్డుకాదని మరోసారి రుజువు అయింది. తినడానికి సరైన తిండి లేకున్నా ఓ యువకుడు పట్టుదలతో ప్రయత్నించి శరీర సౌష్ఠవ పోటీల్లో రాణించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
పొట్టకూటి కోసం ఉద్యోగం చేస్తూనే తన కల సాకారం కోసం అడుగులు వేసి విజయతీరానికి చేరాడు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే శరీర సౌష్ఠవ పోటీల్లో 55 కిలోల విభాగంలో ఛాంపియన్‌గా నిలిచి ప్రశంసలు అందుకున్నాడు.
ఏలూరుకు చెందిన భానుప్రకాశ్ది మధ్య తరగతి కుటుంబం. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఐటీఐతో చదువు ఆపేసి జొమాటోలో డెలివరీ బాయ్ గా చేరాడు.
తనకు చిన్నతనం నుంచే శరీర సౌష్ఠవ పోటీలంటే మక్కువ.అందుకు తగ్గట్టుగా సాధన చేశాడు. అతడి ప్రతిభను గుర్తించిన ఆకుల బ్రదర్స్ ఉచితంగా శిక్షణ ఇప్పించడంతో పాటు వీలైనంత ఎక్కువ సమయం జిమ్ లో గడిపేవాడు.
కష్టం ఫలించడంతో గత నెల శిర్డీలో నిర్వహించిన జాతీయ శరీర సౌష్ఠవ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. 55 కిలోల విభాగంలోఈ ఘనత సాధించాడు.
రాజమహేంద్రవరం, కడప, ఆకివీడు, ఏలూరు, శ్రీకాకుళం, చింతలపూడి, హైదరాబాద్ లో జరిగిన పోటీల్లోనూ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. మిస్టర్ ఆంధ్ర టైటిల్ ను తన ఖాతాలో వేసుకుని పేదరికం లక్ష్యాన్ని చేరుకునేందుకు అడ్డుకాదని నిరూపించాడు. తనకు అండగా నిలిచిన ఆకుల బ్రదర్స్ కు ధన్యవాదాలు తెలిపాడు.