బర్డ్‌ఫ్లూ లక్షణాలతో రెండేళ్ల బాలిక చనిపోయిన ఘటనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన నిపుణుల బృందం, రాష్ట్ర అధికారులు బాలిక మృతిచెందిన ఇంటికివెళ్లి విచారణ జరిపారు. ఈ బృందంలో ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ అంకుర్, ఎయిమ్స్ మంగళగరి పల్మనాలజిస్ట్ రవీంద్ర, మైక్రో బయాలజీ జాయింట్ డైరెక్టర్ నిధి సైని, పశు సంవర్థక శాఖ ప్రతినిధి విజయ్ కుమార్, ఎన్ఐవి పుణె శాస్త్రవేత్త శైలేష్ పవార్‌లతో కూడిన బృందం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించింది. ముందుగా కలెక్టర్ అరుణ్‌బాబు, జిల్లా వైద్యాధికారి రవితో సమావేశం నిర్వహించారు. అనంతరం బాలయ్యనగర్‌లో బాలిక తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి సమాచారం సేకరించారు.
రెండేళ్ల బాలిక కోడి మాంసం పచ్చి ముక్క ఒకటి తిన్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు. గంటకుపైగా బాధిత కుటుంబ సభ్యుల నుంచి కేంద్ర బృందం వివరాలు సేకరించింది. మాంసం దుకాణదారులను కూడా కేంద్ర బృందం సభ్యులు విచారించారు. బాలిక లెప్టోస్పైరోసిస్ వ్యాధి భారిన పడినట్లు అనుమానిస్తున్నారు.
పర్యటన అనంతరం కేంద్ర బృందం, వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. బాలిక మృతిపై చర్చించారు. నిపుణులు నివేదిక ఇచ్చిన తరవాత, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. నిపుణుల బృందం నివేదికలోని అంశాలను పరిశీలించిన తరవాత బర్డ్‌ఫ్లూ నివారణపై పలు సూచనలు చేయనున్నారు.
పేదరికం లేని సమాజమే నా లక్ష్యం : సీఎం చంద్రబాబునాయుడు