వక్ఫ్ సవరణల బిల్లు 2025కు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఓటింగ్‌లో అధికార పక్షం గెలిచింది కానీ ప్రతిపక్షాలు మాత్రం వక్ఫ్ సవరణల బిల్లుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అంతే కాదు, మొత్తం భారతీయ ముస్లిం సమాజం అంతా ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. కానీ నిజాలు దానికి భిన్నంగా ఉన్నాయి. వక్ఫ్ సవరణల బిల్లును సమర్ధించిన ముస్లిములు ఎంతోమంది ఉన్నారు.
బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఈ బిల్లు గురించి మాట్లాడుతూ ‘‘నేను ఉత్తరప్రదేశ్‌లో మంత్రిగా ఉన్నప్పుడు వక్ఫ్ విభాగం నా దగ్గరే ఉండేది. అందులో 90శాతం లిటిగేషన్లు తప్ప ఇంకేం ఉండేవి కావు. మథురలో ఎంతో వక్ఫ్ భూమి ఉంది, దానివల్ల ముస్లిం సమాజానికి ఏ ఉపయోగమూ లేదు. ఒకే భూమి మీద చాలా వివాదాలు ఉండేవి. అవన్నీ పరిష్కారం అవాలి. వక్ఫ్ బోర్డు వల్ల పేద ముస్లిములకు ఏం ప్రయోజనం లేదు. ఇవాళ వక్ఫ్ బోర్డులన్నీ పెద్దపెద్ద వాళ్ళ కబ్జాలో ఉన్నాయి’’ అని స్పష్టంగా వివరించారు.
సజ్జాదా నషీన్ కౌన్సిల్ సభ్యుడు సయ్యద్ ఫరీద్ అహ్మద్ నిజామ్ మాట్లాడుతూ ‘‘భూముల వ్యవహారాలను వక్ఫ్ బోర్డు మరింత జటిలం చేసేసింది. ఒకసారి భూమి వక్ఫ్ స్వాధీనమైతే దాన్ని వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదు. అలాంటి అవకతవకలను ప్రభుత్వం ఈ చట్టం ద్వారా పరిష్కరించాలని భావిస్తోంది, దానివల్ల పేద ముస్లిములకు లాభం చేకూరుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహాబుద్దీన్ రజ్వీ మాట్లాడుతూ ‘‘ఈ బిల్లు విషయంలో సామాన్య ముస్లిములను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ భయపెడుతోంది. ఈ బిల్లు వల్ల ముస్లిములకు వచ్చిన నష్టం ఏమీ లేదు’’ అని తేల్చి చెప్పారు.
జమ్మూకశ్మీర్ వక్ఫ్ బోర్డ్ ఛైర్పెర్సన్ డాక్టర్ దరాఖ్షాన్ అంద్రాబీ మాట్లాడుతూ ‘‘ఈ బిల్లు ముస్లిములకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించడం లేదు. వక్ఫ్ దగ్గర ఇంత భూమే ఉంటే ఇంతమంది ముస్లిములు ఇంకా పేదలుగా ఎందుకున్నారు? ఈ బిల్లు వల్ల ముస్లిములకు ప్రయోజనమే కలుగుతుంది’’ అన్నారు.
శ్రీనగర్‌కు చెందిన బ్రైటర్ కశ్మీర్ పత్రిక సంపాదకుడు ఫరూఖ్ వానీ మాట్లాడుతూ ‘‘వక్ఫ్ బోర్డుకు అధికారాలు ఇస్తే దాని వల్ల సామాన్య ముస్లిములకు ప్రయోజనం కలుగుతుంది. ఈ బిల్లు చాలా సరైనది. దానివల్ల బోర్డు వ్యవహారాల్లో పారదర్శకత వస్తుంది’’ అన్నారు.
‘‘దేశంలో ఎక్కడా ఏ సాధారణ ముస్లిం వ్యక్తీ ఈ బిల్లును వ్యతిరేకించడం లేదు’’ అని యూపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డానిష్ ఆజాద్ అన్సారీ వ్యాఖ్యానించారు.
అజ్మీర్ షరీఫ్‌లోని చిష్తీ ఫౌండేషన్ అధిపతి హాజీ సయ్యద్ సల్మాన్ చిష్తీ మాట్లాడుతూ ‘‘వక్ఫ్ బోర్డును సంస్కరిస్తే… దాని ద్వారా ముస్లిములకు నైపుణ్య శిక్షణ, చదువు, ఉద్యోగం వంటి ప్రయోజనాలు వాటిల్లితే ఆ బిల్లు కచ్చితంగా మంచి మార్పే అవుతుంది’’ అన్నారు.
అజ్మీర్ దర్గా ఆధ్యాత్మిక గురువు సయ్యద్ నసీరుద్దీన్ చిష్తీ మాట్లాడుతూ ‘‘ఈ బిల్లును చూసి ఎవరూ భయపడాల్సిన పని లేదు. దీన్ని బూచిగా చూపించి ముస్లిములు అందరినీ భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది. అది తప్పు’’ అని చెప్పారు.
ముంబై బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు వాసిమ్ ఆర్ ఖాన్ ఈ బిల్లు తెచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ‘‘ఈ బిల్లు నిరుపేద ముస్లిములకు ఎంతో సాయపడుతుంది. వక్ఫ్ ఆస్తులు తమ తాతగారి ముల్లెలు అని భావిస్తున్న వారు ఇకపై అదుపులో ఉంటారు. అసలు ఈ బిల్లును చాలా ముందే తీసుకుని రావలసి ఉంది’’ అన్నారు.
వక్ఫ్ బిల్లును ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షాదాబ్ షామ్స్ పూర్తిగా సమర్ధించారు.
రాజ్యసభ ఎంపీ గులాం అలీ కటానా మాట్లాడుతూ ‘‘వక్ఫ్ బిల్లు వల్ల భారతదేశంలో పేదరికంలో ఉన్న ముస్లిములకు లాభం చేకూరుతుంది. ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసమే అబద్ధపు కథలు వ్యాప్తిలో పెట్టారు. ప్రజల్లో భయాన్ని నింపుతున్నారు’’ అన్నారు.
ఢిల్లీ హజ్ కమిటీ చైర్పర్సన్ కౌసర్ జహాన్ ఈ బిల్లును పరిపూర్ణంగా స్వాగతించారు. ‘‘వక్ఫ్ వ్యవస్థలో జవాబుదారీ తనం, పారదర్శకత్వం, నిష్పక్షపాత ధోరణిని సాధించే దిశలో ఇది గొప్ప ముందడుగు. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ఆస్తుల ప్రస్తుత పరిస్థితలో మార్పులు కచ్చితంగా తీసుకురావలసిందే. నిజంగా సాయం కావలసిన వారికి, మోసపోయిన ముస్లిములకు ఇప్పటివరకూ ఎలాంటి లాభమూ చేకూరలేదు’’ అని కుండ బద్దలుగొట్టారు.
మహారాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ ప్యారే ఖాన్ మాట్లాడుతూ ‘‘నిరుపేదలు, మోసపోయినవారూ అయిన ముస్లిములకు ఇది చాలా మంచిమాట. గత ప్రభుత్వాలు కేవలం కోటీశ్వరులైన ముస్లిముల గురించి మాత్రమే ఆలోచిస్తూండేవి. మోసపోయిన ముస్లిముల గురించి ఎవ్వరూ నోరు విప్పలేదు’’ అని మండిపడ్డారు.
లోక్‌సభలో వక్ఫ్ సవరణల బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో ఢిల్లీలో పలువురు ముస్లిం మహిళలు దానికి సమర్ధనగా పెద్ద ఊరేగింపు చేపట్టారు. ముంబైలో పలువురు ముస్లిం మహిళలు బిల్లుకు తమ ఆమోదం తెలుపుతూ మిఠాయిలు పంచుకున్నారు. ఈ బిల్లుకు సమర్ధనగా భోపాల్‌లో వేలాది ముస్లిం మహిళలు నగర రహదారులపై పాదయాత్ర చేపట్టారు. ‘మోదీజీ ధన్యవాదాలు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మోదీ పోస్టర్లకు పుష్పాభిషేకాలు చేసారు.
ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది ముస్లిములు వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పూర్తిగా మద్దతుగా నిలిచారు. దాన్ని బట్టే, భారతదేశంలో ముస్లిములకు పార్లమెంటులో ప్రాతినిథ్యం వహించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని అర్ధమయింది.