వక్ఫ్ సవరణల బిల్లు 2025కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లును ఉభయ సభల్లోనూ చర్చించి ఓటింగ్ చేపట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే.
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పెర్సనల్ లా బోర్డ్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ‘‘వక్ఫ్ సవరణ బిల్లు 2025పై ప్రభుత్వ వైఖరి శోచనీయం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ త్వరలోనే ఆ బిల్లుకు వ్యతిరేకంగా దేశమంతటా ఆందోళనలు చేపడుతుంది. ఆ బిల్లుపై చట్టపరమైన చర్యలూ తీసుకుంటుంది’’ అంటూ ముస్లిం పీఎల్‌బీ, తమ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.
అంతకుముందు, కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మొహమ్మద్ జావేద్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేష్ కూడా ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం 2019, సమాచార హక్కు చట్టానికి సవరణలను, ఎన్నికల నియమావళికి సవరణలను… ఇంకా అలాంటి చాలా చట్టాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతిని జైరాం రమేష్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా, ప్రార్థనా స్థలాల చట్టం 1991ని సమర్ధించాలంటూ కోర్టును ఇప్పటికే కోరింది. అదే వరుసలో ఇప్పుడు వక్ఫ్ సవరణల బిల్లు రాజ్యాంగబద్ధతను కూడా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో త్వరలోనే సవాల్ చేస్తుందని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు.
వక్ఫ్ సవరణల బిల్లు 2025పై లోక్‌సభలో బుధవారం చర్చ మొదలైంది. ఆ అర్ధరాత్రి దాటాక, సుమారు 14 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం లోక్‌సభలో బిల్లు పాసైంది. ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం 11 గంటలకు రాజ్యసభలో అదే బిల్లుపై చర్చ మొదలైంది. ఏకంగా 17 గంటలు సాగిన ఆ చర్చ శుక్రవారం తెల్లవారుజామున 4గంటలు దాటాక ముగిసింది. పెద్దల సభలో కూడా ఓటింగ్‌లో అధికార పక్షం గెలిచింది, వక్ఫ్ సవరణల బిల్లును ఆమోదింప జేసుకుంది.