NEET నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కొన్నాళ్ళుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అందుకు అనుగుణంగా తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు.
ఈ అంశంపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం, ఈ చర్య దక్షిణాది రాష్ట్రాన్ని అవమానించడమే అని అభిప్రాయపడింది. కేంద్రం ప్రభుత్వం తమ అభ్యర్థనను తిరస్కరించొచ్చు కానీ పోరాటాన్ని ఆపలేరు అని పేర్కొంది. రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తామని అసెంబ్లీలో తెలిపింది. ఈ విషయంపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిస్తామన్నారు.
నీట్ పరీక్ష కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. తమ రాష్ట్రానికి నీట్ నుంచి శాశ్వతంగా మినహాయించాలంటూ కేంద్రాన్ని కోరింది. 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా తిరస్కరణకు గురైంది.