నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు : పవన్ కళ్యాణ్
రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాగాంజలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రి ఏజీఎం దీపక్ ను అరెస్ట్ చేశారు. దీపక్ లైంగిక వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు రాజమండ్రి డీఎస్పీ రమేశ్ బాబు తెలిపారు. మృతురాలి సూసైడ్ నోటుతో పాటు ఘటనకు సంబంధించి హాస్పటల్లో సీసీ కెమెరా విజువల్స్ సేకరించామన్నారు. ఇప్పటికే నాగాంజలి రూమ్‌మేట్స్‌ని కూడా విచారించినట్లు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి పోలీస్ కస్టడీకి తీసుకుంటామన్నారు.
ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరం : పవన్ కళ్యాణ్
నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిందితుడిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. విద్యార్థినులు, యువతుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీస్ శాఖ మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టడంతోపాటు బాధిత వర్గం ఆవేదనను, భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.