పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిసాయి. ఇవాళ ఉభయ సభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. మళ్ళీ వర్షాకాల సమావేశాల సమయంలో సెషన్స్ జరుగుతాయి. దానికి తేదీలు ఇంకా నిర్ణయించవలసి ఉంది.
ఈ సమావేశాల్లో రాజ్యసభ 159 గంటలు పనిచేసిందని సభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. ఈ సెషన్‌లో ఉత్పాదకత 119శాతంగా ఉందన్నారు. రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలియజేసారు.
సభ అత్యధిక సమయం సమావేశమైనది ఏప్రిల్ 3న అని జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ కోసం ఏప్రిల్ 3 ఉదయం 11 గంటలకు సమావేశమైన సభ ఏప్రిల్ 4 తెల్లవారుజామున 4.02 గంటల వరకూ అంటే మొత్తం 17 గంటలు జరిగింది. మొత్తం 4 రోజులు సభాకార్యక్రమాలు అర్ధరాత్రి దాటేవరకూ సాగాయి. ఈసారి పెద్దల సభలో రికార్డు సంఖ్యలో 49 ప్రైవేటుమెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారు.
రాజ్యసభ కొత్త రికార్డు సృష్టించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. వక్ఫ్ సవరణ చట్టం మీద చర్చ 17 గంటల 2 నిమిషాల పాటు జరిగిందని చెప్పారు. రాజ్యసభ చరిత్రలోనే ఒక అంశం మీద అతి ఎక్కువ సేపు చర్చ జరిగిన సందర్భం ఇదేనని వివరించారు. దీనికి ముందు ఆ రికార్డు 1981లో ఎస్మా చట్టంపై చర్చ సందర్భంలో నమోదయింది.
అంతకుముందు, లోక్‌సభ సమావేశాలు ముగిసినట్లు సభాపతి ఓం బిర్లా ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 26 సిటింగ్‌లు జరిగాయన్నారు. బడ్జెట్ సెషన్ రెండు దఫాలుగా జరిగింది. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరిగాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరిగాయి. ఈ బడ్జెట్ సెషన్‌లో 10 ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టారు. అలాగే, వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులు సభ ఆమోదం పొందాయి.