బిమ్స్టెక్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక ప్రతిపాదన చేసారు. బిమ్‌స్టెక్ దేశాల మధ్య చెల్లింపు వ్యవస్థలతో యూపీఐ అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. దాని వల్ల సభ్య దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం, పర్యాటకం అభివృద్ధి చెందుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. బిమ్‌స్టెక్ సభ్య దేశాల కోసం ప్రత్యేకంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. బిమ్‌స్టెక్ ఆరవ సదస్సు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగింది. బిమ్‌స్టెక్ ప్రాంతంలోని దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేసారు.
‘‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీసెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్ – బిమ్‌స్టెక్ ’’లో చేసిన ప్రయత్నాలు సానుకూల మార్పును కలుగజేసాయి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యమంలో ట్వీట్ చేసారు. ఇక్కడ బిమ్స్‌టెక్ నాయకులతో సమావేశమయ్యాను. విభిన్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలన్న నిబద్ధతకు కట్టుబడి ఉన్నాము’’ అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
ఈ సదస్సుకు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వపు ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్ కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీ, యూనుస్‌తో కాసేపు మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసాక ఆమె భారత్‌లో ఆశ్రయం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోదీ, యూనుస్ ముఖాముఖి కలుసుకోవడం ఇదే మొదటిసారి.
సదస్సులో పాల్గొన్న నాయకులు మార్చి 28న మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో భూకంపం వల్ల చనిపోయిన వారి సంస్మరణార్థం ఒక నిమిషం మౌనం పాటించారు.
ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ సీనియర్ జనరల్ ఆంగ్ లాయింగ్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. ముఖ్యంగా కనెక్టివిటీ, సామర్థ్య నిర్మాణం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. మయన్మార్‌లో భూకంపం కారణంగా మరణించిన వారికి మోదీ సంతాపం ప్రకటించారు. ‘‘ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశం మయన్మార్‌లోని మన సోదరసోదరీమణులకు చేయగలిగినంత సహాయం చేస్తోంది’’ అని మోదీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
మోదీ, థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పెంటొంగ్‌టార్న్ షినవత్రాతో గురువారం ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. రక్షణ, భద్రత రంగాల్లో భాగస్వామ్యాలూ, వ్యూహాత్మక కార్యాచరణ గురించి చర్చించారు. ఇరుదేశాల మధ్యా కనెక్టివిటీ మరింత పెంచాలని నిశ్చయించుకున్నారు. ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టార్టప్‌లు, విద్య, సంస్కృతి, పర్యాటకం వంటి అంశాల్లో సంబంధాలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయానికి వచ్చారు.