ఏపీలో అతి భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించినట్లు మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అనకాపల్లి సమీపంలో లక్షా 35 వేల కోట్ల పెట్టుబడులతో ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిస్సాన్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఉక్కు కర్మాగారంతోపాటు డీఎల్ పురం వద్ద క్యాప్టివ్ ఓడరేవు నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రెండు దశల్లో నిస్సాన్ ఉక్కు పరిశ్రమ రానుంది. మొదటి దశ 2029 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. అదే సమయంలో మొదటి దశ ఓడరేవు పనులు పూర్తి చేయనున్నారు. ఇక రెండవ దశ ఉక్కు పరిశ్రమ, ఓడరేవు రెండో భాగం 2033 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు లక్షా 35 వేల కోట్లు వ్యయం చేయనున్నారు. ఓడరేవుకు రూ.11 వేల కోట్లపైగా వెచ్చిస్తారు. ఉక్కు పరిశ్రమ, ఓడరేవు ద్వారా 52 వేల మందికి ఉద్యోగాలు లభిస్తామని మంత్రి చెప్పారు.
అమరావతి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదించింది. పోలవరం నుంచి బనకచర్లకు గోదావరి నీటిని తరలించేందుకు అవసరమైన నిధుల సేకరణకు ప్రత్యేక వాహకనౌకను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉంటారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులంతా పల్లెనిద్ర చేసి అక్కడి సదుపాయాలు పరిశీలించాలని మంత్రిమండలి నిర్ణయించింది. స్టార్ హోటళ్ల నిర్మాణాలకు లైసెన్సు ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి మీడియాకు చెప్పారు.