అమరావతి రాజధాని ప్రాంతంలో కొత్తగా 17 హోటళ్లు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్రీ స్టార్, క్లాసిఫైడ్ హోటళ్లలో బార్లకు లైసెన్సు ఫీజును రూ.25 లక్షలకు తగ్గించింది. దీంతో పర్యాటక రంగానికి మేలు జరుగుతుందని హోటళ్ల యాజమాన్యం తెలిపింది. ఈ ఫీజులు కేరళ, కర్ణాటకలో రూ.10 లక్షలు, తెలంగాణలో రూ.40 లక్షలు ఉండగా, ఏపీలో రూ.25 లక్షలుగా ఉందన్నారు.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఏపీలో 54 త్రీస్టార్ హోటళ్లు నష్టాల నుంచి బయటపడతాయని యాజమాన్యాల సంఘం అభిప్రాయపడింది. లైసెన్సు ఫీజు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హోటళ్ల యాజమాన్యాలు సీఎం చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపాయి. విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
విదేశాలకు వెళ్లిన తెలుగు వారు అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సమస్యలు లేని ప్రాంతాల్లో హోటళ్లను రాత్రి 12 గంటల వరకు, బార్లను రాత్రి 2 గంటల వరకు అనుమతించాలని కోరారు.