మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ పై టీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో బెయిల్ పొందిన అవినాశ్ రెడ్డి, సాక్ష్యాలు తారుమారు చేయిస్తున్నారని అన్నారు.
వివేకాను ఆయన కుమార్తె సునీతే హత్య చేయించిందని విచారణాధికారి ద్వారా రిపోర్ట్ రాయించారన్నారు. వివేకా హత్య కేసులో సాక్షులందరూ ఒకరి తర్వాత మరొకరు చనిపోతుండటంపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సునీతకు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అవినాశ్ రెడ్డి బెయిల్‌పై ఉండి సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడిన షర్మిల, వివేకా హత్య జరిగిన సమయంలో సునీత, ఆమె భర్త అక్కడ లేరని, అవినాష్‌రెడ్డే ఉన్నారని విచారణలో తేలిందన్నారు. రక్తపు మరకల్ని తుడిపించడం నుంచి ఇతర సాక్ష్యాలు తారుమారు చేయడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. సునీతకు అన్యాయం జరిగిందని ఆమెకు న్యాయం జరిగే వరకు తోడుంటానని తెలిపారు.