హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు రోజుల్లో వంద ఎకరాల భూముల్లో చెట్లు నరికివేసారన్న వార్తలపై సుమోటోగా విచారణ జరిపింది. అక్కడ చెట్ల సంరక్షణ మినహా అన్ని పనులనూ తక్షణం నిలిపేయాలని ఆదేశించింది. తమ ఆదేశాల అమలులో ఏమాత్రం తేడా వచ్చినా తెలంగాణ చీఫ్ సెక్రటరీ కటకటాలు లెక్కించాల్సి ఉంటుందంటూ తీవ్రంగా స్పందించింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న 400 ఎకరాల భూముల మీద ఇటీవలే హైకోర్టు తీర్పు వచ్చింది. ఆ భూమి రాష్ట్రప్రభుత్వానిదేనని తేల్చింది. దాంతో ఆ భూమిని రాష్ట్రప్రభుత్వం టీజీఐఐసీకి అప్పగించింది. టీజీఐఐసీ అక్కడ అభివృద్ధి పనులు చేపట్టింది. ఆ క్రమంలో చిట్టడవిలా పెరిగిపోయిన ఆ ప్రాంతాన్ని చదును చేసే పనులు మొదలుపెట్టింది. మూడు రోజుల్లో దాదాపు వంద ఎకరాల భూముల్లో చెట్లు నరికివేసారు.
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులు ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు మొదటిరోజు నుంచే అక్కడ ప్రభుత్వం చేపట్టిన నరికివేత పనులను అడ్డుకొంటున్నారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి, విద్యార్ధులను బలవంతంగా తరలించారు. ఆ క్రమంలో విద్యార్ధుల మీద బలప్రయోగం చేయడం వివాదాస్పదమైంది. మరోవైపు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ పరంగా ఉద్యమాలు ప్రారంభించాయి.
ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ ప్రారంభించింది. వేరే కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది హైదరాబాద్‌లో జరుగుతున్న నరికివేత పనుల గురించి సుప్రీంకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దానిపై జస్టిస్ గవాయ్ స్పందించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కొన్ని గంటల్లోనే నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. ఆ నివేదిక అందేసరికి కోర్టు సమయం అయిపోవచ్చింది. అయినా పట్టు వదలని సుప్రీంకోర్టు, కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత పనులను తక్షణం ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అక్కడ అటవీ ప్రాంతం ఉందనడానికి ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని, అందుకే సుమోటోగా కేసు తీసుకున్నామనీ వెల్లడించారు. ఈ నెల 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు. తమ ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలనీ, లేకపోతే సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేసారు.
మరో సీనియర్ న్యాయవాది ఆ సందర్భంలో జోక్యం చేసుకుని, తెలంగాణ ప్రభుత్వం చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని చెప్పారు. అటవీ హక్కులకు సంబంధించి అన్ని రాష్ట్రప్రభుత్వాలూ 30రోజుల్లోగా కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ కమిటీ ఏర్పాటు చేయనేలేదని వెల్లడించారు. కమిటీ ఏర్పాటు చేసిన ఆరు నెలల్లోగా అటవీ ప్రాంతాలను గుర్తించాలని సుప్రీం చెప్పింది. దాన్ని కూడా పట్టించుకోకుండా, అటవీ ప్రాంతాలను గుర్తించడం కంటె ముందే చెట్లు నరికేస్తోందని వివరించారు. కమిటీలు ఏర్పాటు చేయకపోతే సీఎస్‌దే వ్యక్తిగత బాధ్యత అని సుప్రీంకోర్టు చెప్పినా తెలంగాణ అధికారులు పట్టించుకోలేదన్నారు. దాంతో జస్టిస్ గవాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే నిజమైతే తెలంగాణ సీఎస్ అదే స్థలంలో నిర్మించే తాత్కాలిక జైలుకు వెడతారు అని స్పష్టంగా చెప్పారు.
మంత్రుల కమిటీ ఏర్పాటు:
మరోవైపు, కంచ గచ్చిబౌలి భూముల వివాదం పరిష్కారానికి రేవంత్ రెడ్డి సర్కారు ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ కమిటీలో సభ్యులు. ఆ కమిటీ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్ధుల ప్రతినిధులు, జేఏసీ, సమాజ సేవా సంఘాలతో సమావేశమై ప్రతీ ఒక్కరితోనూ చర్చలు జరుపనుంది. అలాంటి భేటీల్లో మొదటి సమావేశాన్ని ఇవాళ నిర్వహిస్తారు.
వివాదాస్పద భూముల వ్యవహారం గురించి ప్రజలందరికీ తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ కమిటీకి సూచించారు. 1975లో అప్పటికి కొత్తగా ఏర్పాటైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కంచ గచ్చిబౌలిలో స్థలం కేటాయించారు. కానీ భూయాజమాన్య హక్కులు యూనివర్సిటీకి బదలాయించలేదు. ఇప్పుడు వివాదాస్పదమైన భూములు భౌగోళికంగా సెంట్రల్ వర్సిటీ దగ్గరలో ఉన్నాయి. అయితే అవేవీ సెంట్రల్ యూనివర్సిటీ అంతర్భాగం కాదు. అలాగే రెవెన్యూ, అటవీ శాఖల రికార్డుల ప్రకారం ఆ భూమిని ఎప్పుడూ అటవీ భూమిగా వర్గీకరించలేదు. గతంలో ఉన్న వివాదం మీద హైకోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. కాబట్టి ఆ భూమిపై సమస్త హక్కులూ ప్రభుత్వానివే. టీజీఐఐసీ అభ్యర్ధన మేరకు ఆ భూములను ఆ సంస్థకు కేటాయించారు. పూర్తిగా ప్రభుత్వానికి చెందిన ఆ భూమిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అక్కడ పెట్టుబడులకు అవకాశం కల్పించడం వల్ల సుమారు 5లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించే అవకాశముంది అని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఆ కమిటీ ఇవాళ నుంచీ వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరపనుంది.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వం తమ వాదనలతో కూడిన అఫిడవిట్‌ను ఏప్రిల్ 16లోగా సమర్పించాల్సి ఉంది.