ప్రతీకార సుంకాల ప్రభావం మొదలైంది. అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో పలు రంగాలపై ట్రంప్ ప్రభావం పడింది. ముందుగా రొయ్య రైతును తీవ్రంగా నష్టాల్లోకి నెట్టింది. కిలో రొయ్య ధర ఒకేసారి రూ.40 దాకా పడిపోయింది. దీంతో ఒక్కో రైతు కనీసం లక్ష నుంచి రూ.5 లక్షల దాకా నష్టపోయే ప్రమాదముంది.
ట్రంప్ ప్రవేశపెట్టిన పరస్పర సుంకాలు అమల్లోకి వచ్చాయి. దీంతో రొయ్య ధర పతనమైంది. కిలోకు రూ.40 ధర పతనం. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే లక్షా 20 వేల ఎకరాల్లో రొయ్య సాగవుతోంది. దేశంలో రొయ్యల ఎగుమతుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉండగా అందులో 60 శాతం ఒక్క పశ్చిమగోదావరి జిల్లా నుంచే ఎగుమతి అవుతోంది. ఏటా 4 లక్షల టన్నులు ప్రాసెస్ చేసి 54 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీని ద్వారా దేశానికి రూ.18 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం రొయ్యల ఎగుమతి ధరపై పడింది.
బుధవారం 100 కౌంట్ రొయ్య ధర కిలో రూ.240 ఉండగా, గురువారం నాటికే అది కిలో.రూ.200లకు పడిపోయింది. ఎగుమతి సుంకం పెరగడంతో కిలోకు రూ.30 నుంచి రూ.40 దాకా ధరల్లో కోత వేశారు. కొన్ని చోట్ల రొయ్యలు కొనుగోలు చేసేందుకు ఎగుమతిదారులు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. కేవలం రొయ్యలు సాగు చేసిన రైతులే కాదు…ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కూలీల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది.