సంచలనాత్మక వక్ఫ్ సవరణల బిల్లు 2025కు రాజ్యసభలో కూడా ఆమోద ముద్ర పడింది. గురువారం మధ్యాహ్నం మొదలైన చర్చ అర్ధరాత్రి దాటేంత వరకూ కొనసాగింది. ఆ తర్వాత ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 95మంది ఎంపీలు ఓటు వేసారు.
లోక్సభలో బుధవారం సుదీర్ఘ చర్చ జరిగి ఆమోదం లభించిన తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు గురువారం రాజ్యసభ మెట్లెక్కింది. పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు బిల్లును పెద్దల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ముస్లిములకు వ్యతిరేకం కాదని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, సాంకేతికత తీసుకురావడమే తమ లక్ష్యమనీ చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ముస్లిములనూ వక్ఫ్ బోర్డు పరిధిలోకి తీసుకురావడమే తమ ఉద్దేశమన్నారు. 2004లో సుమారు 5లక్షలు ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు సుమారు 9 లక్షలకు పెరిగాయని సభకు వివరించారు. ఈ బిల్లు ముస్లిముల హక్కులను హరించివేస్తుందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పు మీద ప్రతిపక్షాల అనుమానాలకు జవాబిచ్చారు. 22 మంది సభ్యులుండే కౌన్సిల్లో ముస్లిమేతరులను అధికంగా నియమిస్తారన్న ఆరోపణలు తప్పని తేల్చారు.
బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీఎస్, జేడీయూ, శివసేన తదితర పార్టీలు బిల్లుకు మద్దతిచ్చాయి. ఇండీ కూటమి సభ్య పక్షాలు లోక్సభలో లానే రాజ్యసభలో కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. రెండు కూటములకూ చెందకుండా ఉన్న బీజేడీ… మొదట్లో బిల్లును వ్యతిరేకించినా… రాజ్యసభ చర్చకు ముందు తమ ఆలోచన మార్చుకుంది. పార్టీ ఎంపీలకు విప్ జారీ చేయలేదు. రాజ్యసభలోని తమ ఏడుగురు ఎంపీలూ తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయవచ్చునని సూచించింది.
కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును రాజ్యాంగ వ్యతిరేకం అని వ్యాఖ్యానించింది. ముస్లిములను లక్ష్యంగా చేసుకుని సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం కోసమే బీజేపీ ఈ బిల్లును తెస్తోందని మండిపడింది. జేపీసీలో ప్రతిపక్షాలు చేసిన ఏ ఒక్క సిఫార్సునూ ఈ బిల్లులో పొందుపరచలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్తో పాటు దాని మిత్రపక్షాలైన డీఉఎంకే, ఆప్, శివసేన (యుబిటి), తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసారు.
వక్ఫ్ సవరణల బిల్లుకు ప్రభుత్వం యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ – ఉమీద్ బిల్లుగా నామకరణం చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందినందున ఇక ఈ బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించనుంది. ఆ లాంఛనం పూర్తయిన వెంటనే ఉమీద్ బిల్లు చట్టరూపం దాలుస్తుంది.