IPL 2025 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 80 పరుగులు తేడాతో SRH పై నెగ్గింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేయగా, రఘువంశీ 32 బంతుల్లో 50 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (7) విఫలం కాగా కెప్టెన్ అజింక్యా రహానే 27 బంతుల్లో 38 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 17 బంతుల్లో32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆండ్రీ రసెల్ (1) రనౌటయ్యాడు.
సన్ రైజర్స్ బౌలర్లలో షమీ , కమిన్స్, జీషన్ అన్సారీ , కమిందు మెండిస్ , హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ విఫలమైంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వెంటనే వెనుదిరిగారు. ట్రావిస్ హెడ్ రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి వైభవ్ ఆరూరా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అభిషేక్ శర్మ ఆరు బంతులు ఆడి రెండు పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ (2) కూడా వైభవ్ బౌలింగ్ లో దొరికిపోయాడు.
నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 19 పరుగులు చేసి ఆండ్రె రస్సెల్ బౌలింగ్ లో సునిల్ నరైన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కమింద్ మిండెస్(27), హెన్రీచ్ క్లాసిన్ (33) ఫరవాలేదు అనిపించారు.
అంకిత్ వర్మ(6), పాట్ కమిన్స్ (14), హర్షల్ పాటిల్ (3), సిమర్జిత్ సింగ్ (0) నిరాశపరిచారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో వైభవ్ , వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు తీశారు. రస్సెల్ రెండు, హర్షిత్ రానా, సునిల్ నరైన్ ఒక్కో వికెట్ దక్కింది.