ఏప్రిల్ 2న లోక్‌సభ వక్ఫ్ సవరణల బిల్లును ఆమోదించింది. ఆ ఆమోదానికి ముందు 12 గంటలకు పైగా వాడిగా వేడిగా సుదీర్ఘమైన చర్చ జరిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తున్న ఈ బిల్లు విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధాలే జరిగాయి. ఆరోపణలు-ప్రత్యారోపణలు, వాదనలు-ప్రతివాదనలతో పార్లమెంటు వేడెక్కిపోయింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని బలంగా సమర్ధించుకుంది. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని నియంత్రించడానికి, పారదర్శకతను సాధించడానికీ వక్ఫ్ చట్టంలో మార్పులు తప్పనిసరి అని వాదించింది. ప్రతిపక్షం మాత్రం సంబంధం లేని ఆరోపణలు చేసింది. ముస్లిముల విరాళాలను లక్ష్యంగా చేసుకుని రాజ్యాంగబద్ధమైన హక్కులను ఆక్రమించుకోడానికి అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
వక్ఫ్ సవరణ బిల్లు 56 ఓట్ల ఆధిక్యంతో లోక్‌సభ ఆమోదం పొందింది. బిల్లును సమర్ధిస్తూ 288 ఓట్లు పడ్డాయి, వ్యతిరేకిస్తూ 232 ఓట్లు పడ్డాయి. బీజేపీకి మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన, లోక్‌జనశక్తి వంటి పార్టీలు అండగా నిలిచాయి. లోక్‌సభలో చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా శక్తివంతమైన ప్రసంగం చేసారు. ప్రతిపక్షాల వాదనలను తుత్తునియలు చేసారు. ‘‘మీరు కేవలం మీ ఓటుబ్యాంకును పదిలం చేసుకోవడం కోసం మార్పులు చేసారు, వాటిని రద్దు చేయాలని మేం నిర్ణయించుకున్నాం’’ అని కుండ బద్దలుగొట్టారు. అమిత్ షా ప్రకటనతో అధికార పక్షం వైఖరి మరింత ప్రస్ఫుటంగా వెల్లడైంది. ఈ చట్టం చేయడం వెనుక మతపరమైన ఉద్దేశాలు ఉన్నాయన్న ఆరోపణలను కొట్టిపడేసినట్లయింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సైతం ఈ బిల్లు మతం గురించి కాదు, వక్ఫ్ ఆస్తులను క్రమబద్ధీకరించడం గురించి, గత చట్టాల కింద మంజూరు చేసిన ప్రత్యేకమైన అంశాలను తొలగించడం గురించి మాత్రమే అని స్పష్టం చేసారు.
ఈ సుదీర్ఘ చర్చ, ఇటీవలి పార్లమెంటరీ చరిత్రలో అతిపెద్ద చర్చల్లో ఒకటి. కానీ ఇంత తీవ్రమైన, సుదీర్ఘమైన చర్చలకు లోక్‌సభ సాక్షిగా నిలవడం ఇదేమీ మొదటిసారి కాదు. భారత రాజకీయ ముఖచిత్రాన్నీ, చట్టపరమైన విస్తృతినీ తీర్చిదిద్దే పలు బిల్లులను చర్చించి, వాటికి ఆమోదం తెలిపే క్రమంలో ఎన్నెన్నో సుదీర్ఘమైన చర్చలు చోటు చేసుకున్నాయి. అలాంటి వాటిని పరిశీలిద్దాం…
2019 పౌరసత్వ సవరణ బిల్లు:
ఇటీవలి చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన బిల్లు, తీవ్ర ఘర్షణాత్మకమైన చర్చలకు దారి తీసిన బిల్లు ఏంటంటే పౌరసత్వ సవరణ బిల్లు 2019. ఆ బిల్లుపై లోక్‌సభలో చర్చ ఏకంగా తొమ్మిది గంటల పాటు సాగింది. అర్ధరాత్రి దాటిన నాలుగు నిమిషాల తర్వాత ఆ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. భారత్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్తాన్ల నుంచి భారతదేశానికి తరలి వచ్చిన మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించడం ఆ బిల్లు లక్ష్యం. ప్రతిపక్షాలు దాన్ని ముస్లిముల పట్ల వివక్ష చూపడమే అని ఆరోపించాయి. ఆ చట్టం భారతదేశపు మానవతా విలువలకు అనుగుణంగా ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ చట్టం ఎవరి హక్కులనూ తీసేయలేదు, తమ జన్మస్థానాల్లో ఊచకోతను ఎదుర్కొంటున్న మైనారిటీలకు హక్కులు కల్పించింది అని హోంమంత్రి అమిత్ షా ఆ చట్టాన్ని సమర్ధించారు.
2018, మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం:
నరేంద్ర మోదీ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాక, ఆ ప్రభుత్వపు పదవీకాలం ముగియడానికి సుమారు ఏడాది వ్యవధి ఉందనగా, 2018 జులై 20న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దానిమీద చర్చ కూడా 12 గంటలకు పైగానే జరిగింది. ఎన్డీయే కూటమిలోనుంచి అప్పుడే బైటకు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు, వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నువ్వు ఒకందుకు పోస్తే, నేను మరొకందుకు తాగుతా అన్నట్లుగా ప్రతిపక్షాలు తమతమ అవసరాలు, కారణాల కొద్దీ ఆ అవిశ్వాసానికి అండగా నిలిచాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాటకీయ ప్రదర్శన కారణంగా ఆ చర్చపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. రాహుల్ గాంధీ తన సీటునుంచి లేచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి ఆయనను కౌగిలించుకోవడం, ఆ తర్వాత ఎన్డీయే ప్రభుత్వం మీద దారుణమైన దాడి చేసారు. దానికి తర్వాత నరేంద్ర మోదీ ఘాటుగా ప్రతిస్పందించారు. చివరికి ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
2015 రాజ్యాంగ దినంపై చర్చ:
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015 నవంబర్ 26న లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ నిర్వహించారు. ఆ చర్చ ఆద్యంతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలోనే కూర్చున్నారు. వివిధ రాజకీయ పక్షాల నాయకులు రాజ్యాంగ విలువలు, ఆధునిక భారతంలో వాటి ప్రాసంగికత గురించి సుదీర్ఘంగా తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఎనిమిది గంటలకు పైగా సాగిన ఆ చర్చలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, పరిపాలన వంటి అంశాలపై నిశితమైన, తీక్షణమైన పరిశీలనలు చోటు చేసుకున్నాయి.
1979 మొరార్జీ దేశాయ్‌పై అవిశ్వాస తీర్మానం:
స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అవిశ్వాస తీర్మానపు చర్చల్లో ఒకటి 1979లో చోటు చేసుకుంది. ఆనాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు. చివరికి, ఆ చర్చ ముగిసాక ఓటింగ్ జరగకముందే మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసారు. భారత పార్లమెంటరీ చరిత్రలో అవిశ్వాస తీర్మానం కారణంగా సిట్టింగ్ ప్రధానమంత్రి రాజీనామా చేసిన ఒకే ఒక సందర్భం అది.
షాబానో కేసు, ముస్లిం మహిళల (విడాకుల హక్కుల రక్షణ) చట్టం 1986:
పార్లమెంటులో సుదీర్ఘంగా జరిగిన మరో ఆసక్తికరమైన చర్చ, 1986లో షా బానో కేసు గురించి జరిగింది. ఒక ముస్లిం మహిళకు విడాకుల సందర్భంగా తన భర్త నుంచి భరణం పొందడానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని మార్చివేస్తూ రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టమే చేసింది. దానిపై పార్లమెంటులో తీవ్రమైన ఘర్షణలే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఆనాటి చర్చ పది గంటలకు పైగా కొనసాగింది. మహిళల హక్కులు, మతపరమైన చట్టాల విషయంలో వాడిగా వేడిగా సుదీర్ఘంగా జరిగిన చర్చ అది.
ఉపసంహారం:
లోక్‌సభలో సుదీర్ఘచర్చలు భారతదేశపు అద్భుతమైన ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష నిదర్శనాలు. వివాదాస్పద అంశాలపై దేశంలో ఉన్న నిగూఢమైన విభేదాలను అవి పట్టిస్తాయి. ప్రజాప్రతినిధులు తమ వాణి ద్వారా తమ వాదనలను వినిపించడానికి అవకాశం కల్పిస్తాయి. తద్వారా చట్టపరమైన ప్రతిపాదనలను తనిఖీ చేసే అవకాశం కల్పిస్తాయి. ఇలాంటి చర్చలు రాజకీయ నాయకులు తమ తమ వాదనలు వినిపించుకోడానికి మాత్రమే పనికొస్తాయని కొంతమంది విమర్శిస్తారన్న మాటా నిజమే. కానీ ప్రజాభిప్రాయాన్ని, ప్రభుత్వ విధానాలనూ తీర్చిదిద్దడంలో ఇలాంటి చర్చలు కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల