ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆ దేశపు రామాయణం ‘రామాకీన్’ ప్రదర్శనను తిలకించారు. భారతదేశానికి చెందిన భరతనాట్యం, థాయ్‌లాండ్‌కు చెందిన ఖోన్ అనే శాస్త్రీయ నృత్య రీతుల సమ్మేళనంగా ఆ ప్రదర్శనను రూపొందించారు.
అజరామరమూ, కాలాతీతమూ అయిన రామాయణం భారతదేశానికి ఆదికావ్యం. ఆ మహత్తరమైన దివ్యగాథకు థాయ్‌లాండ్‌లో కూడా అద్భుతమైన విలువ ఉంది. ‘అయుత్తయ’ అనే రాజ్యపు రాజు ‘ఫ్రా రామ్’ చరిత్రే ‘రామాకీన్’ కథ. త్యాగం, విధినిర్వహణ, అంకితభావం, భక్తి, చెడుపై మంచి విజయం వంటి అంశాలతో నిండిన రామాయణ గాధ చిన్నచిన్న మార్పులతో థాయ్‌లాండ్ సంస్కృతిలోనూ అదేవిధంగా ఉంది.
‘‘బిమ్స్‌టెక్ సదస్సు కోసం మా అందమైన దేశానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ప్రదర్శనతో స్వాగతం పలికాం. భారతీయ, థాయ్ సంస్కృతుల అద్భుత సమ్మేళనాన్ని ఈ ప్రదర్శనలో చూసాం. ఇక్కడ ప్రధానమంత్రి గొప్ప సమయం గడిపారు’’ అని థాయ్‌లాండ్ విదేశీ వ్యవహారాల సహాయమంత్రి లాలివాన్ కర్ణచనచారి చెప్పారు.
ప్రదర్శనలో పాల్గొన్న ఒక కళాకారిణి ‘‘ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాం. రామాయణాన్ని భరతనాట్య పద్ధతిలోనూ, రామాకీన్‌ను ఖోన్ నృత్యరీతిలోనూ మిళితం చేసి ప్రదర్శించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రత్యేక అతిథుల సమక్షంలో ప్రదర్శన ఇవ్వగలగడం మాకు లభించిన గౌరవం’’ అని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్నారు. విమానాశ్రయం దగ్గర ఆయనకు థాయ్‌లాండ్ ఉపప్రధానమంత్రి, రవాణా మంత్రి అయిన సూరియ జుంగ్రుంగ్రేయంగిట్ స్వాగతం పలికారు. తరువాత హోటల్ దగ్గర ఆయనకు ప్రవాస భారతీయులు గార్బా నృత్యంతో స్వాగతం పలికారు.
‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్’ బిమ్స్‌టెక్ ఆరవ సదస్సు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఏప్రిల్ 3, 4 తేదీల్లో జరుగుతుంది. ఈ పర్యటన పూర్తయాక నరేంద్ర మోదీ శ్రీలంక వెడతారు. అక్కడ 4, 5, 6 తేదీల్లో పర్యటించనున్నారు.