పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్సభ బుధవారం నాడు వక్ఫ్ సవరణల బిల్లు 2025ను ఆమోదించిన సందర్భంగా, భారతీయ జనతాపార్టీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ముస్లిం కార్యకర్తలు, మైనారిటీ మోర్చా నాయకులు బాణాసంచా కాలుస్తూ జైజై మోడీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ముస్లిం మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలతో అభిషేకం చేసారు.
ఆ సందర్భంగా బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మీడియాతో మాట్లాడారు. ‘‘వక్ఫ్ సవరణ బిల్లుతో పేద ముస్లిములకు న్యాయం జరుగుతుంది. దేశంలో సుమారు 12వేల కోట్ల విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. పేద ముస్లిములకు ఇప్పటివరకూ అన్యాయం జరిగింది. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల బండారం బైట పడింది. లోక్సభలో బిల్లు పాసైన రోజును చీకటి రోజు అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించడం విచిత్రంగా ఉంది. ఇందిరాగాంధీ భారతదేశం మీద ఎమర్జెన్సీ విధించిన రోజే అసలైన చీకటి రోజు. ఆ విషయం షర్మిల తెలుసుకోవాలి. ఇందిరాగాంధీ నియంతృత్వపు రోజులు, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చీకటి రోజులు అన్న సంగతి షర్మిల గ్రహించాలి. నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. వైఎస్ఆర్సిపి ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటులో అనుచితంగా మాట్లాడారు. చందాలు ఇచ్చే ముస్లింలకు మాత్రమే అండగా ఉంటారా అంటూ విమర్శలు చేసారు. మిథున్ రెడ్డి పేదల ఆస్తులు మింగిన అరాచక వాది. అటువంటి వాళ్ళను పార్లమెంటుకు వెళ్ళనివ్వకూడదు. మిథున్ రెడ్డి పార్లమెంటులో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని చెప్పారు.
అనంతరం రాష్ట్ర కార్యాలయంలో ముస్లిం మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాషా, మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖుద్దూస్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ రఫీ, షర్మిలా ఖాతూన్, హుస్సేన్, కరీముల్లా, మౌలాలీ, షేక్ సాంబ, ఆయేషా తదితరులు పాల్గొన్నారు.