డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా , పార్టీ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంకుమ బొట్టు పెట్టుకోవద్దు అని, చేతికి కంకణం కట్టుకోవద్దు అని కేడర్ ను కోరారు.డీఎంకే పార్టీతో అనుసంధానమైన ధోతిని ధరించిన సమయంలో మాత్రమే దీనిని పాటించాలని కోరారు. నీలగిరి జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేవుడి నమ్మకాలకు తానేమీ వ్యతిరేకం కాదన్న రాజా, పేద ప్రజల చిరునవ్వులోనే దేవుడు ఉన్నాడని తమ పార్టీ వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై చెప్పారన్నారు. కుంకుమ బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకుంటే ఆర్ఎస్ఎస్ సభ్యుల్లా ఉంటామన్నారు. విద్యార్థి విభాగం కార్యకర్తలు కూడా బొట్టు పెట్టుకోవద్దు అన్నారు. తానేమీ దేవుడిని ఆరాధించవద్దు అనడం లేదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్దలు నుదిటిపై విభూతి పెడితే స్వీకరించాలన్నారు. సరైన రాజకీయ భావజాలం లేకపోవడంతోనే అన్నాడీఎంకే కుదేలు అవుతుందని జోస్యం చెప్పారు.
రాజా వ్యాఖ్యలను తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు ఖండించారు. రాజా చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని పార్టీకి వాటితో సంబంధం లేదన్నారు.
రాజా వ్యాఖ్యలను బీజేపీ కూడా ఖండించింది.
హిందూ మతాన్ని రాజా చిన్నచూపు చూస్తున్నట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మతసామరస్యం గురించి మాట్లాడే డీఎంకే,హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తుందని ప్రశ్నించింది.