భారత్ దేశంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాదిలో వడగాళ్ళ వానలు పడుతుండగా ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
ద్రోణి ప్రభావంతో ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఒడిశా, కొంకణ్, గోవా, కోస్టల్ కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని మైదానాలు, గుజరాత్‌లోని పలు చోట్ల జల్లులుపడే అవకాశం ఉందని అంచనా వేసింది.
మరోవైపు ఉత్తరభారతంలో వేడి వాతావరణం పెరుగుతోందని సూచించింది. దిల్లీ ఎన్సీఆర్తో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా పగటి ఉష్ణోగ్రత రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత పెరగనుంది.
పర్వతాల నుంచి మైదానాల వరకు ఎండలు మండుతుండగా రాబోయే ఆరు రోజుల్లో వాయువ్య భారతదేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 7 వరకు రాజస్థాన్ లో వడగాలులు వీస్తాయని, గుజరాత్లో వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 1న, సౌరాష్ట్ర, కచ్‌లోని సురేంద్రనగర్‌లో గరిష్ఠంగా 42.3 డిగ్రీలుగా నమోదైంది.
అరుణాచల్ ప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. భారత్-మయన్మార్‌ను కలిసే జాతీయ రహదారి 113 తెగిపోయింది.