అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులను పున:ప్రారంభించడంతో పాటు పలు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఈ నెల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై సమీక్ష జరుగుతుందని, ఆలోగా సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలనీ సిఎస్ అధికారులను ఆదేశించారు.
ఇటీవల పి-4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని పర్యటన కార్యక్రమం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆ ప్రాంతంలో 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చదును చేయాలని, అక్కడ పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ సూచించారు. డిజిపి, సీఆర్డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ తదితర అధికారులు ఆప్రాంతాన్ని సందర్శించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటనలో చురుగ్గా పనిచేసిన అధికారుల జాబితాను సిద్ధం చేయాలన్నారు.
రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ గతంలో అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి వచ్చినపుడు వివిధ పనుల నిర్వహణ, పర్యవేక్షణకు అధికారులు,మంత్రులు తదితరులతో పలు కమిటీలను ఏర్పాటు చేసారని గుర్తు చేసారు. ఇప్పుడు కూడా అలాగే కమిటీలు వేయాలని సూచించారు.
సీఎస్ సమీక్షా సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, సీఆర్డీఏ కమీషనర్ కె.కన్నబాబు, ఐజి ఎస్పీఎఫ్ హఫీజ్ ఆరిఫ్, సీఆర్డీఏ అదనపు కమీషనర్లు ప్రవీణ్ చంద్, నవీన్, వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ వీరపాండియన్ పాల్గొన్నారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, రెండు జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులూ పాల్గొన్నారు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల