పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి పోలీసుల దర్యాప్తులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట దగ్గర ఆయన పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు వెల్లడైంది.
బుధవారం తనిఖీ చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లలో… జగ్గయ్యపేట దగ్గర జాతీయ రహదారిపై ప్రవీణ్ ప్రమాదకరంగా ప్రయాణించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. జగ్గయ్యపేట ఫుడ్ ప్లాజా దగ్గర ప్రవీణ్ ఒక భారీ ట్యాంకర్‌ను దాటే ప్రయత్నం చేసారు. వాహనం మీద తూగుతూ వెడుతున్న ప్రవీణ్ అదుపు తప్పి ట్యాంకర్ వెనుక చక్రం దగ్గర కింద పడ్డారు. లారీ వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, బస్సును పూర్తిగా కుడివైపు తిప్పడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు మీద కొంతమంది వ్యక్తులు బండిని పైకెత్తి పక్కన పెట్టారు. ప్రవీణ్‌కు సాయం చేయడానికి ప్రయత్నించారు.
ఇప్పటివరకూ తనిఖీ చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను బట్టి ప్రవీణ్ పగడాల ఒక్క ఎన్‌టీఆర్ జిల్లాలోనే మూడుచోట్ల తనంత తానే ప్రమాదానికి గురి అయినట్లు స్పష్టమైంది. వాహనం మీద తూలుతూ ప్రయాణించడం వల్ల చాలాచోట్ల ప్రమాదాల బారిన పడినట్లు వెల్లడయింది. జగ్గయ్యపేట దగ్గర ప్రమాదం జరిగే సమయానికి బులెట్ హెడ్‌లైట్ బాగానే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ వల్ల తెలిసింది.