విశాఖపట్నంలో ఓ యువకుడు తను ప్రేమించిన యువతి తల్లిని హత్య చేసిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మన్యం జిల్లా పనసనందివాడ గ్రామానికి చెందిన దమర్ సింగ్ నవీన్ (26) విశాఖపట్టణంలో నివసిస్తున్నాడు. విజయనగరం జిల్లా పుర్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం విశాఖలో నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన దీపిక (20) డిగ్రీ పూర్తి చేసి నగరంలో ఓ చిరుద్యోగం చేస్తోంది. నవీన్, దీపిక నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ వ్యవహారం పెళ్ళి వరకూ వెళ్ళింది. అయితే కొన్నాళ్ళ క్రితం విభేదాలు తలెత్తడంతో వారి పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. దీపిక వేరే ఉద్యోగం చూసుకోడానికి హైదరాబాద్ వెళ్ళడానికి బుధవారం టికెట్ బుక్ చేసుకుంది.
ఆ విషయం తెలిసిన నవీన్ బుధవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్ళి గొడవ పడ్డాడు. వెంట తెచ్చుకున్న రెండు చాకులతో దాడి చేసాడు. దీపిక, ఆమె తల్లి లక్ష్మి ఇద్దరినీ గాయపరిచి, వారి పీకలు కోసి పరారయ్యాడు. లక్ష్మి అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలిసిన పోలీసులు దీపికను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. పోలీసులు నిందితుడి ఆచూకీని సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కనుగొని, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల