ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న ఆలోచన చేసింది. ఇంటి అవసరాలకు అవసరమైన వస్తువులన్నీ ఒకేచోట విక్రయించేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులు నాలుగైదు చోట్లకు తిరిగే అవకాశం లేకుండా అన్ని వస్తువులూ ఒకేచోట కొనుగోలు చేసేలా మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ లోని ఎనిమిది నగరాల్లో ‘స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ల’ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒకే చోట 200 మంది వ్యాపారాలు చేసుకునేలా సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టనుంది. ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా నెల్లూరులో జూన్‌లో ప్రారంభించనున్నారు.
ప్రత్యేకంగా కంటైనర్లను ఏర్పాటు చేసి ఒకేసారి 200 షాపులు నిర్వహించేలా ‘ప్లగ్అండ్ప్లే’ విధానంలో వాటిని వ్యాపారులకు కేటాయించనున్నారు. కంటైనర్పైన సోలార్ పలకలు అమర్చడంతో పాటు ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను షాపు అవసరాలకు వినియోగించనున్నారు. నిత్యావసరాల నుంచి పండ్లు, కూరగాయలు ఇక్కడ విక్రయిస్తారు.
రెండో దశలో భాగంగా విశాఖ, విజయవాడ, మంగళగిరి, పిఠాపురం, శ్రీకాకుళం, ఒంగోలులోనూ వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురంలో ఏదో ఒక నగరాన్ని త్వరలో ఎంపిక చేయనున్నారు. అక్టోబరు నుంచి అందుబాటులోకి వస్తాయి.
ప్రధాన కూడళ్లలో రోడ్లకు ఇరువైపులా తోపుడుబళ్లపై వ్యాపారాలు చేస్తున్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, నగరపాలక సంస్థల అధికారులు, రాజకీయ నేతలు, ఎవరికి కోపం వచ్చినా వారు తమ బళ్లను అక్కడి నుంచి తీసేయాల్సిందే.
ఎనిమిది మార్కెట్ల ద్వారా 1,600 మంది చిరు వ్యాపారుల ఉపాధి దొరకడంతో పాటు మరో 400 మందికి మార్కెట్ శుభ్రం చేయడం, కాపలాదార్లుగా, ఇతరత్రా పనులు దొరుకుతాయి. ఒక్కో మార్కెట్ కోసం ప్రభుత్వం రూ.7 కోట్ల చొప్పున ఖర్చు చేయనుంది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 కోట్లు, వ్యాపారుల శిక్షణ, ఇతర సేవలు అందించేందుకు సెర్ప్ రూ.1.25 కోట్లు ఖర్చు చేయనుంది. బ్యాంకుల నుంచి వ్యాపారులకు పెట్టుబడి నిధి కింద రూ.3 కోట్ల మేర రుణాలు సమకూర్చనున్నారు.