వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చలో భాగంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఈ దేశపు మైనారిటీలను భయపెట్టడం ద్వారా ప్రతిపక్షాలు ఓటుబ్యాంకును నిర్మించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ముస్లిముల మతపరమైన కార్యకలాపాల్లోనో, ధార్మిక సంస్థలు ఇచ్చిన విరాళాలతోనో జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం భావించడం లేదని స్పష్టం చేసారు.
‘‘వక్ఫ్ బోర్డులోని ముస్లిమేతర సభ్యులు మతపరమైన విరాళాల విషయంలో జోక్యం చేసుకోరు. వక్ఫ్ బోర్డులో నియమించబడే నాన్-ముస్లిం సభ్యుల పని మతపరమైన కార్యకలాపాలకు సంబంధించినది కాదు. చారిటీ కమిషనర్‌గా ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా ఉండవచ్చు, విరాళాల చట్టం ప్రకారం బోర్డు నడుచుకునేలా చూడడం మాత్రమే అతని పని. అది కార్యనిర్వహణకు సంబంధించిన పని, మతపరమైనది కాదు’’ అని వివరించారు.
‘‘వక్ఫ్ బోర్డు పని… వక్ఫ్ ఆస్తులను అమ్మేసుకుంటున్న వారిని పట్టుకుని విసిరివేయడమే. విపక్షాలు తాము అధికారంలో ఉన్నప్పుడు అలాంటి అక్రమాల్లో భాగస్వాములుగా ఉండేవి, ఆ పద్ధతే ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాయి. కానీ ఇకపై అలా ఎంతమాత్రం జరగదు’’ అని స్పష్టం చేసారు.
వక్ఫ్ చట్టానికి 2013లో సవరణలు చేసి ఉండకపోతే, ఇప్పుడు ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరమే లేదని అమిత్ షా వివరించారు. ‘‘2013లో రాత్రికి రాత్రి వక్ఫ్ చట్టానికి సవరణలు చేసారు. ముస్లిములను బుజ్జగించడం కోసం, తద్వారా 2014లో వారి ఓట్లను పొందడం కోసమే ఆ సవరణలు చేసారు. వాటి కారణంగానే ఇప్పుడు ఢిల్లీ లుట్యెన్స్ జోన్‌లోని 123 వీవీఐపీ ఆస్తులు వక్ఫ్‌కు ఇచ్చేసారు’’ అని వివరించారు.
వక్ఫ్ బిల్లును నిశితంగా పరీక్షించడానికి ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ విస్తృతస్థాయిలో చర్చలు చేపట్టిందని అమిత్ షా చెప్పారు. ‘‘వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మేము ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసాము. ఆ కమిటీ 38 సమావేశాలు నిర్వహించింది. 113 గంటలు చర్చలు జరిగాయి. 284మంది సభ్యులు పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచీ కోటికి పైగా సూచనలు ఆన్లైన్లో వచ్చాయి. వాటన్నింటినీ అధ్యయనం చేసి, విశ్లేషించి వాటిని క్రోడీకరించి ఈ చట్టానికి రూపకల్పన చేసాము. దీన్ని ఉత్తనే ఓటుబ్యాంకు రాజకీయాల కోసం తిరస్కరించకూడదు’’ అని చెప్పారు.
వక్ఫ్ సవరణ బిల్లు మీద నియమించిన ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ జేపీసీకి అధ్యక్షుడుగా వ్యవహరించిన బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ కూడా లోక్‌సభ చర్చలో పాల్గొన్నారు. మూడవ విడత మోదీ ప్రభుత్వంలో అతి ముఖ్యమైన చట్టాల్లో ఇదొకటి అని వ్యాఖ్యానించారు.